YS Jagan In Delhi: నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి జగన్ నీతి ఆయోగ్ ఎనిమిదవ పాలకమండలి సమావేశంలో వెల్లడించారు.
న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ ఎనిమిదవ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్ర పరిస్దితులు, ప్రగతిపై నివేదిక సమర్పించారు.
నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్..
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని, తద్వారా ఆర్థికవ్యవస్థ మరింత వేగంగా పురోగమిస్తుందని చెప్పారు. భారత దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు చాలా ఎక్కవుగా ఉందని, లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14శాతంగా నమోదవుతున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారిందని వివరించారు. అమెరికాలో లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5శాతానికే పరిమితం అయ్యిందని, గడచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవయం చేస్తోందని అన్నారు. ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరమని జగన్ అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసిందని, విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా PPP పద్ధతిలో నిర్మిస్తోందన్నారు. దేశ GDPలో తయారీ మరియు సేవల రంగం 85% దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5%. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులు రెండింటికి సంబంధించిన అంశాలపై అత్యంత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం అవసరమని చెప్పారు. తయారీ మరియు సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరమని, దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరని జగన్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశఆరు. వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా అనుమతులు.. విధానాలను సరళీకృతం చేశామన్నారు. వాడుకలో లేని చట్టపరమైన నిబంధనలను సవరించటంతో పాటుగా కొన్నింటిని రద్దు చేశామని చెప్పారు.
విశాఖ సమిట్ ను ప్రస్తావించిన జగన్...
నీతి ఆయోగ్ సమావేశంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ను గురించి సీఎం ప్రస్తావించారు. విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి అద్భుతమైన స్పందన లభించించిందని, రూ. 13 లక్షల కోట్లు భారీ పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రజారోగ్యం, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమని జగన్ అన్నారు.పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, పెరుగుతున్న NCD (సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధుల)ల భారం గురించి తెలుసుకోవాలని, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి అనారోగ్యాలకు సమయానికి చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. దీనిపై ఎక్కువగా శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉందని, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, పౌష్టికాహారంపై అత్యంత శ్రద్ధపెట్టాలన్నారు.
గ్రామ వార్డు సచివాలయాలపై జగన్ వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,592 గ్రామ మరియు వార్డు క్లినిక్‌లను ఏర్పాటు చేసిందని, ఇందులో ఒక మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఒక ANMను, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచాని తెలిపారు. ప్రతి విలేజ్ మరియు వార్డు క్లినిక్‌లో 105 రకాల అవసరమైన మందులు మరియు 14 రకాల డయాగ్నస్టిక్స్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలో, రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించి, విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాసుపత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్స్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించిందన్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు.