Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 హైలైట్స్ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Andhra Pradesh: వచ్చే ఐదు నెలల కాలానికి సంబంధించి 2,94,427.25కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తొలి బడ్జెట్‌ను సభ ముందు ఉంచారు.
Andhra Pradesh Assembly Sessions 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,94,427.25కోట్లతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన తొలి బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆర్థిక ప్రగతి, సంక్షేమాన్ని సమానంగా ప్రజలకు అందించేందుకు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ద్రవ్య లోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెవెన్యూ లోటు 4.19 శాతంగానూ ద్రవ్యలోటు 2.12 శాతంగానూ ఉండవచు అంచనా కట్టారు.
సవరించిన అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,12,450 కోట్ల రూపాయలు అయితే మూలధన వ్యయం 23,330 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 38,682 కోట్ల రూపాయలు కాగా, ద్రవ్యలోటు దాదాపు 62,720 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో వరుసగా 2.65 శాతంగానూ మరియు 4.30 శాతంగానూ ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ చెప్పిన లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 43,488 కోట్లు ఉంటే.. ద్రవ్యలోటు 52,509 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు వరుసగా 3.3 శాతంగానూ, 3.98 శాతంగానూ తెలిపారు.
వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి
- యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ- రూ. 322 కోట్ల
- పోలీసు శాఖ- రూ. 8,495 కోట్లు
- పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ - రూ. 687 కోట్లు
- రవాణా, రోడ్లు, భవనాల శాఖ- రూ. 9,554 కోట్లు
- ఇంధన శాఖ - రూ. 8,207 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య శాఖ- రూ. 3,127 కోట్లు
- జలవనరుల శాఖ- రూ 16,705 కోట్లు
- గృహ నిర్మాణ శాఖ- రూ. 4,012 కోట్లు
- పురపాలక పట్టణాభివృద్ధి శాఖ- రూ. 11,490కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ. 16,739 కోట్ల
- వైద్యారోగ్య శాఖ - రూ. 18,421 కోట్లు
- ఉన్నత విద్యాశాఖ- రూ. 2,326 కోట్లు
- పాఠశాల విద్యాశాఖ- రూ. 29,909 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శాఖ- రూ.1,215కోట్లు
- మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ- రూ. 4,285కోట్లు
- షెడ్యూల్ కులాల సంక్షేమం- రూ. 18,497 కోట్లు
- షెడ్యూల్ తెగల సంక్షేమం- రూ. 7,557 కోట్లు
- బీసీల సంక్షేమం - రూ. 39,007కోట్లు
- అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం- రూ. 4,376కోట్లు
- వ్యవసాయం, అనుబంధ రంగాలకు- రూ. 11,855 కోట్లు
పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో నేడు ఏపీ ఎదుర్కొంటున్న సవాళ్ళు వివరించారు. :
- రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం
- రాష్ట్ర వనరుల మళ్ళింపు;
- లోపభూయిష్టమైన ఎక్సైజ్, ఇసుక విధానాలతో ఆదాయానికి గండి
- ప్రభుత్వ పన్నులు దారి మళ్ళించి 25 ఏళ్ల భవిష్యత్తు ఆదాయం తగ్గించడం
- పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం
- కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం
- కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్ళింపు
- పిల్లల పౌష్టిక ఆహారం కోసం చిక్కి, వైద్య సామాగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపుల నిలుపుదల
- స్థానిక సంస్థల నిధుల మళ్ళింపు
- ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు
- వివిధ పనులకు చెందిన బిల్లుల బకాయిలు
- ప్రాజెక్టుల నిధులు స్తంభింపజేయడంతో నీటిపారుదల రంగం కుదేలు
- ఇంధన రంగ విధ్వంసం
- బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఏర్పాటుతో కార్పొరేషన్ల నిధుల మళ్ళింపు