AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీలో కీలక పరిణామం- జగన్ ను క్షమించి వదిలేస్తున్న: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Andhra Pradesh News | ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష హోదా కోసం అవాకులు చెవాకులు పేలుతున్న జగన్ ను క్షమించి వదిలేస్తున్న అని అయ్యన్న పాత్రుడు అన్నారు.

AP assembly speaker Ayyanna Patrudu | అమరావతి: తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 11 నిమిషాలు అసెంబ్లీలో ఆందోళనకు దిగి నినాదాలు చేసి, గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేయడం తెలిసిందే. ఈ క్రమం ఏపీ అసెంబ్లీలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనను తాను క్షమించేశానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) వ్యాఖ్యానించారు.
దేవుడు ఇవ్వని వరాన్ని పూజారి నుంచి ఆశించడమా..
ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్, ఆ పార్టీ సభ్యులు నిరాధార ఆరోపణలు, ప్రకటనలు చేయడాన్ని స్పీకర్ తప్పుపట్టారు. బుధవారం సభలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష హోదాపై జగన్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టుల విచారణ పూర్తయ్యే వరకు వేచి చూద్దాం అనుకున్న. కానీ జగన్ సహా వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా తమకు దక్కకపోవడంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. స్పీకర్ సీటుపై దురుద్దేశాన్ని ఆపాదించడం సభ నియమాల ఉల్లంఘన కిందకు వస్తుంది. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పే’ అని అయ్యన్న పాత్రుడు అన్నారు.
ప్రతిపక్ష హోదాపై జగనే తేల్చేశారు..
నిబంధనల ప్రకారం మొత్తం 175 మంది సభ్యులుండగా, 10 శాతం సీట్లు అంటే 18 స్థానాలు ఆ పార్టీ నెగ్గాల్సి ఉంటుందన్నారు. అలా కాని పక్షంలో ప్రతిపక్ష హోదా ఉండదని వైఎస్ జగన్ గతంలో అసెంబ్లీలో చెప్పారని అయ్యన్న పాత్రుడు గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తన వరకు వచ్చేసరికి నిబంధనలు తుంగలో తొక్కి, ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేసిన జగన్ ను క్షమించి వదిలేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది జూన్ 24న ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ, బెదిరింపులతో జగన్ తనకు లేఖ రాశారని, ఆపై హైకోర్టును సైతం ఆశ్రయించారని స్పీకర్ పేర్కొన్నారు. కోర్టులో సైతం పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా స్థితిలో ఉందని తెలిపారు.
వైసీపీ సభ్యుల నియోజకవర్గాలను ఎవరు పట్టించుకుంటారు..
ప్రతిపక్ష హోదాపై వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు అసత్యాలు ప్రచారం సరికాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. తమ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతారని ప్రజలు సభ్యులను గెలిపిస్తారు. కానీ వైసీపీ సభ్యులు వీటిని పట్టించుకోకుండా, ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ సభ్యులు సభకు రాకపోతే వారి నియోజకవర్గాల సమస్యల్ని సభలో ఎవరు లేవనెత్తున్నారు. అందుకే వైసీపీ సభ్యులను సభకు వచ్చి, సమస్యలపై ప్రశ్నించాలని.. తమకు తోచిన సలహాలు, సూచనలు చేయాలని స్పీకర్ పిలుపునిచ్చారు. సభకు వచ్చి హుందాగా వ్యవహరించి తమ నియోజకవర్గం కోసం ప్రశ్నించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం సాధ్యం కాదని ఈ మేరకు స్పీకర్ స్పష్టమైన రూలింగ్ ఇచ్చారు. దీంతో ఇక జగన్ కోర్టులలో కూడా పోరాడలేని పరిస్థితి వచ్చిందని అనుకోవచ్చు.






















