AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి లాస్ట్ మీటింగ్- లాస్ట్ ఫొటో
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి భేటీ అయింది. వచ్చే సమావేశానికి వీళ్లంతా మాజీలు కానున్నారు. వాళ్లెవరు అనే చర్చ నడుస్తోందిప్పుడు.
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశమైంది. ఇందులో దాదాపు అందరు మాజీలు కానున్నారు. చివరి సమావేశంలో వారితో జగన్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఎవరెవర్నీ తీసేస్తున్నారు... ఎందుకు తీస్తున్నారో వివరించి చెప్పనున్నారు. పార్టీ పరంగా వాళ్లను ఎలా వినియోగించుకోనున్నారో వివరిస్తారు.
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం నలుగుర్ని మినహా అందరి మంత్రులను మార్చేయనున్నట్టు తెలుస్తోంది. మారిన జిల్లా స్వరూపం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొత్తగా వచ్చేవాళ్లు ఎవరు వెళ్లిపోయేవాళ్లు ఎవరనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.
చాలా మంది మంత్రులకు మంత్రిగా ఇదే చివరి రోజు కావడంతో ఆయా ఛాంబర్స్‌లో సందడి వాతావరణం కనిపించింది. చివరి నిమిషంలో పెండింగ్ ఫైల్స్‌పై మంత్రులు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. మంత్రులను కలిసేందుకు అధికారులు, సన్నిహితులు రావడంతో అక్కడ పండగ వాతావరణం కనిపించింది.
మంత్రివర్గ సమావేశం పూర్తైన వెంటనే మంత్రులంతా రాజీనామాలు చేయనున్నారుు. వాటిని సీఎంకు సమర్పించనున్నారు. వాటిని సాధారణ పరిపాలన విభాగం గవర్నర్‌కు పంపిస్తుంది. గవర్నర్ ఆమోదంతో మంత్రులంతా మాజీలు అవుతారు. ఆవెంటనే కొత్త మంత్రుల జాబితాను కూడా గవర్నర్‌కు సీఎం జగన్ పంపించనున్నారు. వీళ్లతో 11వ తేదీని ప్రమాణస్వీకారం చేయించనున్నారు గవర్నర్.
మంత్రివర్గ విస్తీర్ణంలో పేర్ని నాని, కొడాలి నానికి చోటు దక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. వాళ్లిద్దరికి పార్టీ పదవులు ఇవ్వనున్నారని సమాచారం. పేర్ని నానిని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుణ్ని చేస్తారని... రీజనల్ ఇన్‌ఛార్జిగా కొడాలి నాని నియమించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికాసేపట్లో వీటన్నింటిపై క్లారిటీ రానుంది.
దీనికి సంబంధించి నిన్నే సీఎం జగన్... గవర్నర్‌తో సమావేశమై వివరాలు అందజేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే టీం వివరాలు కూడా అందించనున్నారు.