Jagan Review Meeting: ఆధార్‌తో ఆరోగ్యశ్రీ కార్డు అనుసంధానం.. మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశం
ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. టీచర్లు సహా, స్కూల్స్ లో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులతో పాటు పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వ్యాక్సిన్ ఇవ్వాలని.. దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్ ఇచ్చినట్లవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్లు వృథా కాకుండా మరింత సమర్థంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. 18- 44 ఏళ్ల మధ్య వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని జగన్ ఆదేశించారు. ప్రజలతో సంబంధాలున్న ఉద్యోగులు, సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
డిజిటల్ హెల్త్‌పై సమీక్ష
అనంతరం డిజిటల్ హెల్త్‌పై సమీక్షించిన సీఎం.. ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు క్యూఆర్ కోడ్ రూపంలో అందుబాటులో ఉండాలన్నారు. విలేజ్ క్లీనిక్స్‌లో కూడా డేటా వివరాల నమోదుతో పాటు ప్రతి విలేజ్, వార్డు క్లీనిక్స్‌లో కూడా కంప్యూటర్ ఉండాలని అధికారులను ఆదేశించారు. విలేజ్ క్లీనిక్స్‌లో సాధారణ పరీక్షలు చేసే పరిస్థితి రావాలని, షుగర్, బీపీ, బ్లడ్ గ్రూప్ సహా ఇతర వివరాలు కార్డులో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరుపై ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు లభ్యమయ్యేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలని ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ సరిపడా సిబ్బందిని నియమించాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని.. నియమాకాల్లో జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీ నుంచి పైస్థాయి ఆస్పత్రులకు కూడా కాంపౌండ్‌వాల్ ఉండాలని తెలిపారు. మూడునెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో కాలుష్య నియంత్రణపై కూడా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలని, ఈ క్రమంలోనే విలేజ్ క్లీనిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్‌పై దృష్టిపెట్టాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయన్న జగన్… గతంతో పోల్చుకుంటే ఈ కేసులు తక్కువే అయినప్పటికీ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉన్నందున మరిన్ని జాగ్రత్తలు అవసరం అన్నారు. సెకెండ్ వేవ్ లో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకుని...థర్డ్ వేవ్ ని పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కరోనా నిబంధనలను వీలైనంత వరకు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హాజరయ్యారు.