Ambati Rambabu: ఆయన్ను ఎవరు చంపారో చెప్పు, లేదంటే నీ రాజకీయ భవిష్యత్తు సున్నా - అంబటి రాంబాబు
టీడీపీ బస్సు యాత్ర గురించి మాట్లాడుతూ.. అది తుస్సు యాత్ర అని కొట్టిపారేశారు. అక్కడ జనాలు లేరని, కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా బస్సు యాత్రకు రాలేదని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ తన ఆవేశంతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, ఆయన నిలకడ లేని వ్యక్తి అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అలాంటి వ్యక్తికి యువత మద్దతు పలకవద్దని పిలుపు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపి మరెవరికో ఇవ్వాలని అంటున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు గురువారం (జూన్ 29) మీడియాతో మాట్లాడారు. టీడీపీ బస్సు యాత్ర గురించి మాట్లాడుతూ.. అది తుస్సు యాత్ర అని కొట్టిపారేశారు. అక్కడ జనాలు లేరని, కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా బస్సు యాత్రకు రాలేదని ఎద్దేవా చేశారు. కన్నా లక్ష్మీ నారాయణ విసిరిన సెల్ఫీ ఛాలెంజ్ ను కూడా ఎద్దేవా చేశారు. అసలు ఆయన టీడీపీలో ఉంటారో లేదో డౌట్ అని, అసలు ఛాలెంజ్ లు చేసే అర్హత అనేది ఆయనకు లేదని స్పష్టం చేశారు.
సత్తెనపల్లికి టీడీపీ ఇన్‌ఛార్జి అయిన కన్నా లక్ష్మీ నారాయణకు తాను మూడు సవాళ్లు విసురుతున్నానని అన్నారు. వంగవీటి మోహన రంగారావుని హతమార్చింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ విషయం తెలిసి కూడా చెప్పకపోతే నీ రాజకీయ భవిష్యత్తు సున్నా అవుతుందని అన్నారు. నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరో కూడా చెప్పాలని సవాలు విసిరారు. చివరిదాకా చంద్రన్న వెంట ఉంటావా? లేక పారిపోతావా అని ప్రశ్నించారు. పైగా అసలు సత్తెనపల్లిలో చివరిదాకా ఉండి పోటీ చేస్తావా? లేక పారిపోతావా? అని నిలదీశారు. ముందు వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
యువగళానికి గళమే లేదని, ఒక మాట చెప్పబోయి మరో మాట చెబుతున్నాడని అన్నారు. ఏపీలో మళ్లీమళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, ఆ విషయం అర్థమైపోయి ఊగిపోతూ మాట్లాడుతున్నారని అన్నారు. మంచి నాయకుడి మీద విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తాను ఓడిపోయిన సందర్భంలో చాలా బాధ పడ్డానని ఇప్పుడు చెబుతున్నారని, గతంలో తాను ఓటమిని లెక్కచేయబోనని అన్నారని గుర్తుచేశారు. ఈయన మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఎద్దేవా చేశారు. పవన్ ని నమ్ముకొని రాజకీయాలు చేస్తే అందరూ నష్టపోతారని అన్నారు.
బక్రీద్ పండుగలో పాల్గొ్న్న అంబటి
అంతకుముందు అంబటి రాంబాబు బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. మనోవాంఛ, స్వార్థం, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలో ఆంతర్యమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని పిడుగురాళ్ల మార్గంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, ఏడాదంతా కుటుంబాల్లో నూతన శోభ వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు.