AP DGP Rajendranath Reddy: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటే చర్యలు తప్పవు: ఏపీ డీజీపీ
Amaravati Farmers Padayatra: నిరసన తెలిపే హక్కు వారికి ఉందని, అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటే చర్యలు తప్పవని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.
అమరావతి రైతుల పాదయాత్రను ఏపీ ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని చాలా రోజులుగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. సమస్యలు ఉన్నవారు నిరసన తెలిపే హక్కు వారికి ఉందని, అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ స్పష్టం చేశారు. నిరసనలు చేసుకోండి.. కానీ అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దు అని వాటి నిర్వాహకులకు చెబుతున్నామని తెలిపారు.
పోలీసుల సరైన చర్యల వల్లే సమస్యలు రాలేదు
పాదయాత్ర ఎక్కడ జరుగుతుందో ఆ జిల్లాల ఎస్పీలు ముందుగానే అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నవారిని ముందుగా పిలిపించి యాత్రను అడ్డుకోవద్దని చెబుతున్నారని వెల్లడించారు. నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. పోలీసులు సరైన చర్యలు తీసుకున్నందు వల్లే ఇప్పటివరకూ ఎక్కడా తీవ్ర సమస్యలు వచ్చినట్లు కనిపించలేదన్నారు. ఒకవేళ ఎక్కడైనా అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్నట్లు కనిపిస్తే, సమస్యలు ఉత్పన్నమైనా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలు తలెత్తకుండా చూసేది పోలీసులేనని, వారు ఇలాంటివి ఎందుకు చేస్తారంటూ మీడియాకు పరిస్థితిని వివరించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.
ఆందోళన అక్కర్లేదు: ఏపీ డీజీపీ
రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఆరోపణలు ఉన్నాయని మీడియా ప్రశ్నించగా.. అవి మీ ఆరోపణలు మాత్రమే అన్నారు డీజీపీ. మేము శాంతిభద్రతల పరిరక్షణకే ఉన్నామని, అలాంటి పనులు తాము చేయడం లేదన్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమీక్షిస్తున్నామని తెలిపారు. పరిస్థితిని ముందుగానే గుర్తించి మరీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నామని చెప్పిన డీజీపీ.. తమపై ఆరోపణల్లో నిజం లేదన్నారు. రైతు పాదయాత్ర ఇప్పటివరకూ ప్రశాంతంగా జరిగిందని, ఎలాంటి ఉద్రిక్త వాతావరణమూ లేదన్నారు. దీనిపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాత్ర సాగుతున్న ప్రాంతాల్లో అదనపు సిబ్బంది, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని.. ఆయా జిల్లాల ఎస్పీలు అలర్ట్ గా ఉన్నారని చెప్పారు.
ఏపీ సీఐడీ పోలీసులు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వకుండానే పలువుర్ని అరెస్టు చేయడంపై డీజీపీ స్పందించారు. ఈ విషయంపై సంబంధిత అధికారితో మాట్లాడాలని మీడియాకు డీజీపీ సూచించారు. తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతోందని.. తాను చేసిన పనులకు కోర్టు తప్పుపట్టలేదన్నారు. హైకోర్టు అడిగే అంశాలకు మాత్రం సమాధానం ఇవ్వడం తమ బాధ్యత అన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను దూషిస్తూ పోస్టులు పెడితే కేసులు నమోదు కావడం లేదని, అధికార వైసీపీ నేతలపై పోస్టులు పెడితే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నామనేది అవాస్తవం అన్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించి స్పష్టమైన వివరాలు, ఆధారాలు ఉంటే అందించాలని, వాటిని పరిశీలిస్తామని ఏపీ డీజీపీ చెప్పారు. రుణయాప్‌ల మోసాలపై ఇప్పటివరకూ 75 కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. కోట్ల రూపాయల నగదు రికవరీ చేశామని, ప్రధాన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
నేడు విశాఖ గర్జన
రాష్ట్రంలో మూడు రాజధానులకు మద్దతుగా నేడు విశాఖలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన నిర్వహిస్తున్నారు. విశాఖ గర్జన రూట్ మ్యాప్ విడదల చేసింది జేఏసీ. అక్టోబర్ 15 (శనివారం) ఉదయం 10 గంటలకు LIC బిల్డింగ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా జైల్ రోడ్, సిరిపురం, చిన వాల్తేర్ జంక్షన్ మీదుగా బీచ్ వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకూ ప్రదర్శనగా వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద భారీ సభ నిర్వహించనున్నారు. ర్యాలీ జరిగే సమయంలో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.