Amaravati Land Pooling: అమరావతి భూ సమీకరణకు పదకొండేళ్లు.. రాజధానికి భూమి ఇచ్చిన తొలి వ్యక్తి ఎవరంటే..?
AP Capital Amaravati | అమరావతి భూ సమీకరణకు పదకొండేళ్ళు పూర్తయింది. అయితే రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూమి ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియ ప్రారంభమై నేటికి 11 సంవత్సరాలు.కరెక్ట్ గా చెప్పాలంటే 2015 జనవరి 2వ తేదీన నేలపాడులో పూలింగు కింద భూములు తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. మొదటి రోజు న తొలిగా తుళ్లూరుకు చెందిన మహిళా రైతు కొమ్మినేని ఆదిలక్ష్మి తన వంతుగా 3.50 ఎకరాలు ఇచ్చారు. రెండో వ్యక్తిగా దామినేని శ్రీనివాసరావు 15 ఎకరాలు, ధనేకుల రామారావు 11 ఎకరాలు పూలింగు కింద ఇచ్చారు. తొలిరోజు అన్ని ధ్రువీకరణలు పూర్తయి 89 ఎకరాలు భూసమీకరణ కింద తీసుకున్నారు.
అప్పట్లో మూడేళ్లలో రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాటలు పూర్తిగా అభివృద్ధి చేసి తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో రాజధాని పూర్తవుతుందని, పరిపాలన అక్కడ నుంచే ప్రారంభిస్తామనీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే నేటికీ సరిగ్గా 11 సంవత్సరాలు పూర్తయినా పూలింగ్ జరుగుతూనే ఉన్నాయి. ఉండవల్లి, వెనుమాక గ్రామాల్లో సమీకరణ కింద ఇంకా భూములు తీసుకుంటున్నారు. 2,200 ఎకరాలు ఇంకా తీసుకోవాల్సి ఉంది. అమరావతి సమీకరణ అనంతరం రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
రైతుల సమస్యలు పరిష్కారానికి నోచలేదు. వాటిని పరిశీలించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసినా అక్కడ ఇంకా చర్చల దశలోనే సమస్యలు వున్నాయి. రైతులు మాత్రం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని వేర్వేరు పద్ధతుల్లో తమ నిరసనలు వ్యక్తం చేశారు. 2015 జనవరిలో ప్రక్రియ ప్రారంభమైతే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఇప్పటికీ అక్కడ ప్రారంభమైంది తాత్కాలిక సెక్రటేరియట్ తాత్కాలిక హైకోర్టు మాత్రమే. శాశ్వత నిర్మాణముగా సిఆర్డిఎ ప్రధాన కార్యాలయం మాత్రం పూర్తయింది. ఒకటి రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తను భవనాలు ప్రారంభించుకున్నాయి.
విపరీతమైన కాలయాపన.. రైతుల్లో పెరుగుతోన్న అసహనం
సిటీ సివిల్ కోర్టు భవనాల్లోనే ఇప్పటికీ హైకోర్టు విభాగాలు నడుస్తున్నాయి. మాస్టర్ ప్లానులో వీధిపోటు ప్లాట్లు ఇంకా ఉన్నాయి. అలాగే గ్రామకంఠం భూముల సమస్య జరీబు, నాన్ జరీబు, అసైండ్ భూములు, చెరువు భూమిలో ప్లాట్ల కేటాయింపు వంటి సమస్యలు 11 ఏళ్ల నుండి కొనసాగుతూనే ఉన్నాయి. వెంకటపాలెం గ్రాములలో అయితే జాతీయ రహదారి భూమిలో ప్లాట్లు వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కరకట్టను విస్తరించి మూడేళ్లలో జాతీయ రహదారికి అనుసంధానం చేస్తామని అప్పట్లో మంత్రి నారాయణ ప్రకటన చేసినా ఇప్పటికీ అనునుధాన వసులు జరుగుతున్నాయి. రాజధాని చట్టబద్ధత అంశం కొలిక్కి రాలేదు. ఇంకా చట్టబధత పరిశీలనలోనే ఉంది. గెజిట్ వస్తుందని అనుకున్నా రాలేదు.రాజధాని రైతులు ప్రభుత్వానికి భూములిచ్చారు.
2019 వరకూ టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ వారి సమస్యలు పరిష్కారం కాలేదు. 2019 తరువాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల ప్రకటనతో రైతులు ఒక్కసారిగా కుదేలయ్యారు. వారిపై కేసులు, పనులు నిలిపేయడం వంటి చర్యలతో రాజధాని వసులు రాదాపు నిలిచిపోయాయి. 2024లో మళ్లి అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం పనులు ప్రారంభించినా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు మారినా కేంద్రంలో బిజెపియే అధికారంలో ఉంది. రాజధానికి ఇస్తామన్న నిధులు పూర్తిస్థాయిలో ఇవ్వనేలేదు. చేస్తామన్న పనులూ చేయలేదు. రెండు పార్టీలనూ తన పంచన చేర్చుకుని పబ్బం గడుపుకుందన్న విమర్శలు ఉన్నాయి..రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పినా చివరకు తాము ఇవ్యాల్పింది రూ.2,200 కోట్లేనని చేతులు దులుపుకుంది. అయినా రాష్ట్ర ప్రభత్వాలు ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయలేదు.
2018 చివర్లో కేంద్రం మోసాన్ని కడిగిపారేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి నేడు అదే బిజెపి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. జి ఏ డి టవర్లకు 2019లో ర్యాఫ్ట్ వేస్తే ఇప్పుడు కొద్దికొద్దిగా పనులు ప్రారంభిస్తున్నారు. ల్యాండ్ పూలింగు స్కీము ప్లాట్లు అభివృద్ది పనులు, రోడ్ల ఏర్పాట్లు వంటివి చేస్తున్నారు. అధికారుల, MLA ల భవనాలు తుది దశకు చేరుకున్నాయి
రైతులకు ఇవ్వాల్సిన భూముల విషయంలో లేట్
రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కు ఇవ్వాల్సిన రిటర్న్ బుల్ ఫ్లాట్స్ విషయం లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఇచ్చిన ప్లాట్లు కూడా సరైన చోట ఇవ్వలేదనే అసంతృప్తి నెమ్మదిగా రైతుల్లో పెరుగుతోంది. అయితే ఇప్పటికీ అమరావతి రైతులు టీడీపీ ప్రభుత్వం ఫై నమ్మకం ఉంచుతున్నారు. కానీ గతంతో పోలిస్తే అది తక్కువే అని చెప్పాలి.ముఖ్యం గా అమరావతి రైతు JAC నాయకులు తమకు భూములు ఇచ్చిన రైతుల నుండి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక పోతున్నాము అంటూ మంత్రి నారాయణ, CRDA అధికారుల ముందు మధ్య అసహనం వ్యక్తం చేశారు.
మొదలైన రెండో విడత భూ సమీకరణ
ఈ విమర్శలు, అసహనాలు అలానే ఉండగానే రాజధాని లో మరో విడత భూసమీకరణ ప్రారంభించింది ప్రభుత్వం.ఇప్పుడు పాత రైతులకు తోడు క్రొత్త రైతులకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ప్రభుత్వం. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఈ ఒత్తిడి ని ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా తట్టుకుంటుందో చూడాలి.





















