Ysrcp Shock To Anam :ఎమ్మెల్యే ఆనంకు వైసీపీ హైకమాండ్ షాక్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గా రాంకుమార్ రెడ్డి నియామకం
Ysrcp Shock To Anam : వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. నియోజకవర్గ సమన్వయకర్తగా రాంకుమార్ రెడ్డిని నియమించింది.
Ysrcp Shock To Anam : నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైసీపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. వెంకటగిరి వైసీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించింది. దీంతో నేదురుమల్లి రాంకుమార్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలతో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను వైసీపీ నియమించారు.
నియోజకవర్గ ఇంఛార్జ్ గా నేదురుమల్లి రాంకుమార్
మాజీ మంత్రి ఆనంను వైసీపీ నుంచి బయటకు సాగనంపే టైమ్ వచ్చింది. పొమ్మనకుండానే ఆయనకు పొగ పెట్టేశారు. ఆయన కూడా చాన్నాళ్లుగా ఊపిరాడటంలేదంటున్నారు, ఇప్పుడు బయటకొచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోబోతున్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి ఉండగానే, ఆ నియోజకవర్గానికీ వైసీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ప్రకటించింది. తరచూ బహిరంగ వేదికలపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఎమ్మెల్యే ఆనం. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ నియోజకవర్గ బాధ్యతలను నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి అప్పగించింది.
వివాదాస్పద వ్యాఖ్యలు
మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తరచూ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. ఏపీలో తమకింకా ఏడాదిన్నరకు పైగా అధికారం ఉందని, ముందస్తు ఎన్నికల ఊహాగానాలు నిజమైతే ముందే ఇంటికెళ్లిపోవడం ఖాయమని కుండబద్దలు కొట్టారు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఇటీవల వరుసగా ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ఆయన, తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలొస్తే ముందే ఇంటికెళ్లిపోతామన్నారు. పరోక్షంగా ప్రభుత్వం పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ముందస్తు ఎన్నికలొస్తే ఇంటికెళ్లడం ఖాయమంటున్న ఆయన, ప్రజలు తమకు ఇచ్చిన పదవీకాలం పూర్తి కావొచ్చిందని, అయితే ఇంకా ప్రజలకిచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలోనే ఇంకా సచివాలయాల నిర్మాణాలు పూర్తి కాలేదని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదా, లేక చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదా అనేది తనకు తెలియడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు.
కుర్చీకి ఎసరు
వరుసగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్న ఆయన ఈ సారి పార్టీలో అంతర్గత గొడవల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుర్చీకి ఎసరు పెట్టే నాయకులు పుట్టుకొస్తున్నారని, ఏడాదికి ముందే ఆ కుర్చీ నాదని కొంతమంది చెప్పుకుంటున్నారని అన్నారు. దీనిపై మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఆ వార్తల్ని అధిష్టానం చెవిన పడేయాలని, వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులకు సూచించారు. ఎన్నికలకు ఏడాది ఉండగానే తన కుర్చీ లాగేయాలని కొంతమంది చూస్తున్నారని చెప్పారు ఆనం రామనారాయణ రెడ్డి. తనను ఐదేళ్ల కు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని.. మరో ఏడాది వరకు ఆ సీటు తనదేనని, ఆ తర్వాత వారు ఎక్కడ కూర్చున్నా ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. జగనన్న ముద్ర ఉందని అలాంటివారు చెప్పుకుంటున్నారని, కానీ తనకు ప్రజలు ఇచ్చిన రాజ ముద్ర ఉందని అన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తాను నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతల్ని భుజాన మోస్తున్నానని అన్నారు ఆనం.