Chandrababu Naidu: చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం, సెక్యూరిటీ అలర్ట్
Chandrababu Undavalli House: ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.
TDP President: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న చంద్రబాబు ఇంటి సమీపంలోని తాటి చెట్లకు నిప్పు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగలు అలుముకోవడంతో అక్కడ ఉన్న పోలీసులు పరుగులు పెట్టారు. చంద్రబాబు ఇంటి పరిసర ప్రాంతాలు హైసెక్యూరిటీ జోన్ కావడంతో అక్కడ 24 గంటలు పోలీసులు పహరా కాస్తూ ఉంటారు. మంటలు వ్యాపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోగా.. సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో స్థానికులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
మంటలు ఎగిసిపడుతున్న సమయంలోనే కొంతమంది హైకోర్టు జడ్జీలు అటుగా వెళ్లారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా? లేదా కావాలని ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా నిప్పు పెట్టారా? అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. చంద్రబాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ భారీ భద్రత ఉంటుంది. అనుమతి లేకుండా పోలీసులు ఎవరినీ అనుమతించరు. అలాంటి సెక్యూరిటీ ప్రాంతంలో మంటలు ఎలా చెలరేగాయనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇవాళ జరిగిన ఘటనకు సంబంధించి మంటలు వ్యాపించిన వెంటనే పోలీసులు అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
గతంలోనూ ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం
అయితే చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో చంద్రబాబు ఇంటి దగ్గర ఎండు గడ్డి తగలబడటంతో పొలాల్లోకి మంటలు వ్యాపించాయి. భదత్రా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. అప్పట్లో కూడా అగ్నిప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనేది బయటకు రాలేదు.
కాగా, ఇవాళ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలోనే ఉన్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికలపై చర్చించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై నేతలతో చర్చించారు. టీడీపీకి సరిపడ ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేనందున రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని నేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రా.. కదలి.. రా, నారా లోకేష్ చేపడుతున్న శంఖారావం సభలపై నేతలతో టీడీపీ బాస్ చర్చించారు. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే నేతలను చేర్చుకోవడంపై కూడా నేతల నిర్ణయాలను చంద్రబాబు తీసుకున్నారు. వైసీపీ నుంచి చాలామంది నేతలు టీడీపీలోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని, కానీ అందరినీ తీసుకోలేమని చంద్రబాబు చెప్పారు, అన్నీ ఆలోచించిన తర్వాతనే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకుంటానని అన్నారు. పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగనివ్వనని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ భేటీలో యనమల రామకృష్ణుడు, అనగాని సత్యప్రసాద్, కంభంపాటి, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.