Hair Fall Solutions: కరోనా వచ్చి తగ్గాక జట్టు రాలుతోందా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోరుకున్న చాలా మంది జట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారని డెర్మటాలజిస్ట్‌లు చెప్పారు. అయితే... దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరంలేని, ఇది సాధారణ సమస్యేనని అన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న 70 నుంచి 80 శాతం మందికి ఈ సమస్య ఎదురవుతోందని, కొందరిలో తీవ్రత ఎక్కువగా ఉంటే, మరికొందరిలో తక్కువగా ఉంటుందన్నారు.
2 నుంచి 4 నెలల సమయం పడుతోంది
జుట్టు రాలే సమస్యతో తీవ్రంగా బాధపడేవారికి ఆ సమస్య నుంచి కోలుకోవాలంటే 2 నుంచి 4 నెలల సమయం పడుతుందట. ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇలా వెంట్రుకలు రాలే సమస్యను టెలో జెన్ ఎఫ్లూవియమ్ అంటారు. కరోనా సోకిన సమయంలో ఎక్కువ ఒత్తిడికి, ఆందోళనకు గురైన వారిలో, గతంలో సర్జరీలు చేయించుకున్న వారిలో జట్టు రాలే సమస్య ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ సమస్య బారిన పడిన వారు మాత్రం కోలుకునేందుకు సుమారు నాలుగు నెలల సమయం పడుతుందన్నారు.
తీసుకోవల్సిన జాగ్రత్తలు
కరోనా నుంచి కోలుకున్నాక కూడా అందరూ పౌష్టికాహారం తీసుకోవాలి. జట్టు రాలకుండా నియంత్రించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. గుడ్లు, చికెన్, చేపలు, ఆకుకూరలు, కూరగాయలు, సోయాబీన్, పనీర్ లాంటి పదార్థాలు తీసుకోవాలి. ఇక రక్తప్రసరణ బాగా ఉండేందుకు తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎక్సర్సైజ్ ద్వారా ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి జరిగి.. వెంట్రుకలు పటిష్టమయ్యేందుకు సహకరిస్తాయి.
జుట్టు పెరిగేందుకు ఉల్లిరసం
రాలిన జుట్టు తిరిగి పెరిగేందుకు ఉల్లిరసం బాగా ఉపయోగపడుతోందని పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రెండు లేదా మూడు ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసి మిక్సీలో బాగా మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఆ తర్వాత పలుచటి గుడ్డ సాయంతో ఆ పేస్టు నుంచి రసాన్ని తీయాలి. ఇప్పుడు ఆ రసంలో దూదిని ముంచి తల మొత్తం పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే మీరే మార్పును గమనించవచ్చు.
వైరస్ వచ్చి తగ్గాక జట్టుకు సప్లిమెంట్స్ వాడటం కూడా మంచిది. జట్టు బలంగా ఉండేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మల్టీ విటమిన్లు ఉన్న సప్లిమెంట్స్ వాడొచ్చు. అలాగే రెడిన్సిల్, లిప్సిల్ లాంటి బొటానికల్ లోషన్లను కూడా జట్టుకు పట్టించవచ్చు.
ఈ నియమాలన్నీ పాటించిన తర్వాత కూడా మీ జట్టు రాలడం తగ్గకపోతే డెర్మటాలజిస్ట్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి. వెంట్రుకలు గట్టిగా అయ్యేందుకు, కొత్తవి వచ్చేందుకు థెరపీలు సైతం అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కరోనా తగ్గాక జట్టు రాలుతుంటే ఎక్కువ ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.