Chaddi Gang: ముగ్గురు చడ్డీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసిన బెజవాడ పోలీసులు
చెడ్డీ గ్యాంగ్ దొంగల వ్యహహారం ఓ కొలిక్కి వచ్చింది. ఈగ్యాంగ్ లో ముగ్గురు సభ్యులను గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. కమీషనరేట్ పరిధిలో వరుస చోరీలతో ఈ గ్యాంగ్ నగరవాసులకు కంటి మీద కునుకులేకుండా చేసింది. చెడ్డీ గ్యాంగ్ వివరాలను సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు.గ్యాంగ్ సభ్యులు ముగ్గురిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.15 రోజుల నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి చోరీ సొత్తు లో 20వేల నగదు, ముప్పై రెండు గ్రాముల బంగారం, రెండున్నర కేజీలు వెండి సొత్తు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి విజయవాడ నుంచి ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, గుజరాత్ కు వెళ్లి ఎంతో శ్రమించి గ్యాంగ్ సభ్యులను పట్టుకున్నారని తెలిపారు. పోరంకి వసంత నగర్ లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విజయవాడ టూ టౌన్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటపల్లి లో జరిగిన చోరీ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. మరికొంతమంది పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.