Girl Rape Case Updates: రాజు శవం మార్చురీకి.. స్థానికుల ఆగ్రహావేశాలు, ఏకంగా అంబులెన్స్‌పైకి..
రైల్వే ట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజీఎంలో రాజు శవానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ప్రస్తుతం సంచలనంగా మారిన హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలిక హత్యాచారం కేసులో చనిపోయిన నిందితుడిపై ఇంకా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. గురువారం (సెప్టెంబరు 16) ఉదయం బాలిక హత్యాచార కేసులో నిందితుడు పులికొండ రాజు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అతడి శవాన్ని పోలీసులు వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మార్చురీకి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ మృతదేహాన్ని కాజీపేట రైల్వే సీఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో రాజు శవాన్ని అంబులెన్స్‌లో ఎక్కించి ఎంజీఎం మార్చురీకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు మృత దేహాన్ని తరలిస్తున్న క్రమంలో అంబులెన్స్‌పై పలువురు చెప్పులు, రాళ్లు విసిరారు. వారిని భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎంజీఎం ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజీఎంలో రాజు శవానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇచ్చారు. రాజు కుటుంబ సభ్యులు వస్తే పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేయాలని ఆసుపత్రి డాక్టర్లు, పోలీసులు ఎదురు చూశారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి అతను రాజు అని గుర్తించాకే శవ పరీక్ష చేస్తారని అధికారులు వెల్లడించగా.. రాజు తల్లి భార్య ఆస్పత్రికి వచ్చి రాజును గుర్తించారు. పచ్చబొట్టు, పుట్టమచ్చల ఆధారంగా అతను రాజు అని కనుక్కున్నారు. మరోవైపు, నిందితుడు రాజు ఆత్మహత్యతో హైదరాబాద్‌లో సంబరాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల అయితే, ఏకంగా టపాసులు కాలుస్తూ సందడి చేశారు.
మరోవైపు, పోలీసులే తన కొడుకుని ఉరికించి ఉరికించి చంపేశారని వీరమ్మ ఆరోపించింది. తన కొడుకు కొద్ది రోజుల క్రితమే పోలీసులకు దొరికాడని పోలీసులే చంపేశారని సంచలన ఆరోపణలు చేశారు. ‘‘నా కొడుకు రాజు 3 రోజుల కిందటే రైల్వే స్టేషన్‌లో పోలీసులకు చిక్కాడని పోలీసులే చెప్పారు. రాజును ఎన్ కౌంటర్ చేయాలని పై నుంచి ఆర్డర్ వచ్చిందని వాళ్లే మాట్లాడుకుంటుంటే మేం విన్నాం. నిన్న మొత్తం మా వివరాలన్నీ రాసుకున్నారు. మూడు రోజుల నుంచి స్టేషన్‌లో ఉన్నా ఎవరూ రాలేదు. నిన్న ఒక్కసారిగా అందరూ వచ్చారు. అప్పుడే మాకు డౌట్ వచ్చి అడిగితే దొరకలేదని బుకాయించారు. మిమ్మల్ని వదిలేస్తున్నాం అని నిన్న రాత్రి 10 గంటలకు మమ్మల్ని ఉప్పల్‌లో వదిలిపెట్టారు. పోలీసులే నా కొడుకును ఉరికించి చంపేశారు. వాళ్లకు 3 రోజుల కిందటే రాజు దొరికినా ఈ రోజు మమ్మల్ని ఇటు పంపించి వాడిని అక్కడ చంపేశారు.’’ అని ఆమె రోదిస్తూ చెప్పారు.
నిందితుడి అత్త మాత్రం మరోలా స్పందించింది. తన బిడ్డను రాజు ఆగం చేసిండని ఆవేదన వ్యక్తం చేసింది. వాడికి ఏం పోయేకాలం వచ్చిందో అంటూ మీడియాతో దూషిస్తూ మాట్లాడింది.
Also Read: Rape Accused Death: కామాంధుడు రాజు మృతిపై తల్లి వీరమ్మ సంచలన ఆరోపణలు.. భార్య కూడా..