Janagama: ప్రేమ పెళ్లికి కండీషన్ పెట్టిన వధువు ఫ్యామిలీ - విషం తాగిన వరుడు, అతని తల్లి
సాయి కుమార్ అదే మండలం గోపరాజు పల్లికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లికి ఇరు కుటుంబాల్లో ఒప్పుకోరనే భయంతో ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి గత మే 13న పెళ్లి చేసుకున్నారు.
యువతి యువకుల మధ్య ప్రేమ వ్యవహారం తల్లీ కొడుకుల ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. చివరికి కుమారుడు చనిపోగా, తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. యువతి తరపు బంధువులు, కుటుంబ సభ్యులు పెట్టిన ఓ షరతు వల్లే వారికి ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు, పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జనగామ జిల్లా అదే మండలానికి చెందిన పెద్ద పహాడ్ లో జరిగింది.
జనగామ మండలం పెద్దపహాడ్ గ్రామంలో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద పహాడ్‌కు చెందిన దండు సాయి కుమార్ అనే 24 ఏళ్ల వ్యక్తి పదో తరగతి పూర్తి చేసి అదే ఊళ్లో డ్రైవరుగా పని చేస్తున్నాడు. వరి కోత మిషను డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. కుటుంబంలో తల్లి, ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. వారి కుటుంబం మొత్తానికి ఆస్తిగా రెండు ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉంది. ఆ భూమి ద్వారా వచ్చే పంటతో పాటు, సాయి కుమార్ సోదరుడు చిన్నా చితక పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
మరోవైపు, సాయి కుమార్ అదే మండలం గోపరాజు పల్లికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లికి ఇరు కుటుంబాల్లో ఒప్పుకోరనే భయంతో ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి గత మే 13న పెళ్లి చేసుకున్నారు. అలా వారు భువనగిరిలో కాపురం పెట్టారు. పెద్దలు వారిని వెతుక్కుంటూ వచ్చి, వారితో మాట్లాడి ఇంటికి రమ్మని నచ్చ చెప్పారు. తమతో వస్తే ఘనంగా మరోసారి పెళ్లి జరిపిస్తామంటూ చెప్పారు. వారి మాటలు విన్న యువతి యువకుడు ఇద్దరూ వారి వారి సొంత ఊర్లకు చేరుకున్నారు.
అమ్మాయి కుటుంబ సభ్యుల షరతు
ఇలా ఉండగా, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలంటే వారు ఓ కండీషన్ పెట్టారు. సాయి కుమార్ వాటా కింద వచ్చే ఎకరం పొలాన్ని అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని కోరారు. అలా చేస్తేనే ఇద్దరి పెళ్లికి ఒప్పుకొంటామని చెప్పారు. సాయి కుమార్ తల్లి అందుకు ఒప్పుకోలేదు. ఈ లోగా అమ్మాయికి మరో పెళ్లి సంబంధం చూస్తున్నారని సాయి కుమార్ కు తెలిసింది. దీంతో అతను పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరు వర్గాలను పిలిచి ఆరా తీశారు.
అయితే, ఈ పరిస్థితికి తన కుమారుడు సాయి కుమార్ అని భావించిన తల్లి రుక్కమ్మ సోమవారం కొడుకుతో గొడవ పడింది. పొలాన్ని అమ్మాయి పేరు మీద రాయాలని కోరగా, ససేమిరా అని తేల్చి చెప్పింది. ఆ గొడవ కారణంగా తల్లి రుక్కమ్మ మనస్తాపంతో అదే రోజు అర్ధరాత్రి పురుగుల మందు తాగింది. తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం చూసి అదే పురుగుల మందు డబ్బా తీసుకొని సాయి కుమార్ తాగాడు. ఊరి బయటకు వెళ్లి మందు తాగడంతో అపస్మారక స్థితికి చేరుకొని పడిపోయాడు. ఆలస్యంగా ఇతణ్ని స్థానికులు గుర్తించారు. ఇద్దరినీ జనగామలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి కుమార్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందగా, రుక్కమ్మ కొన ఊపిరితో ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు.