Breaking News Live: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై ఆగ్రహం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వాయుగుండం తమిళనాడు తీరం వైపుగా కదులుతుందని, దీని ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నైరుతి నుంచి 70 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురవనున్నాయి.
యానాం, ఉత్తర కోస్తాంధ్రలో వెదర్ అప్‌డేట్స్
శ్రీలంకలోని ట్రింకానమలీకి 180 కి.మీ తూర్పుగా, తమిళనాడు నాగపట్నానికి 470 కి.మీ దూరంలో, పుదుచ్చేరికి 470 కి.మీ దూరంలో, చెన్నైకి 530 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం ఏపీలో మార్చి 4 అర్ధరాత్రి నుంచి మొదలవుతుంది. అల్పపీడనం ఎఫెక్ట్, ఆగ్నేయ గాలుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. తీరం వెంట బలమైన గాలులు దక్షిణ దిశ నుంచి 50 నుంచి 60 కి. మీ వేగంతో వీస్తాయని హెచ్చరించారు. అయితే ఉత్తర కోస్తాంధ్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జంగమేశ్వరపురం, బాపట్లలో, నందిగామలో, అమరావతిలో, తునిలో, విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో దక్షిణ కోస్త్రాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరో 36 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ తూర్పు శ్రీలంక తీరం వెంట ఉత్తర తమిళనాడు వద్ద తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి 6, 7 మరియు 8 న వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఉష్ణోగ్రత కొంత తగ్గడంతో వాతావరణం చల్లగా ఉంటుంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
అల్పపీడనం ప్రభావం తమిళనాడు, శ్రీలంకతో పాటు తెలంగాణపై సైతం ఉంటుంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయి. కొన్ని చోట్ల వాతావరణం పొడిగా మారుతుంది. వాయుగుండం ప్రభావంతో ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అల్పపీడనం తమిళనాడు తీరాన్ని రాత్రి తాకే అవకాశం ఉంది. మొదట తమిళనాడు, లంక తీరంలో వర్షాలు కురుస్తాయి. ఏపీలో ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉండగా, తెలంగాణలో చిరు జల్లులు పడతాయి.
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై ఆగ్రహం
బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై తెలంగాణ గవర్నర్ తమిళి సై స్పందించారు. ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ చర్యలను గమినిస్తున్నారన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనసాగింపులో భాగంగానే సమావేశాల ఉంటాయన్న ప్రభుత్వ వైఖరి సరికాదని తమిళి సై అన్నారు.
కెనాల్ లో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి, విద్యార్థి సంఘాలు ఆందోళన
హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉన్నటువంటి కెనాల్ లో పడి లక్కా చందు(20) మృతి చెందాడు. ఈ ఘటనతో యూనివర్సిటీ రిజిస్టర్ ముందు ఏబీవీపీ విద్యార్థుల నిరసన చేశారు. విద్యార్థి మృతికి హాస్టల్ వార్డెన్ పర్యవేక్షణ లోపమే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్టల్ కేర్ టేకేర్ ని విధుల నుంచి తొలగించి విద్యార్థికి ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రూ.61 లక్షల బంగారం పట్టివేత
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 1144 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 61.72 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. లోదుస్తుల్లో పాకెట్ అమర్చి బంగారాన్ని తరలిస్తుండగా అనుమనంతో తనిఖీ చేస్తే బంగారం ఉందన్నారు. బంగారం స్వాధీనం చేసుకోని కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు.
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం : మంత్రి బొత్స సత్యనారాయణ
'ఒకటికి పది సార్లు చెబుతున్నాం. మేం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం' అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు తమకు ప్రామాణికం కాదన్నారు. రానున్న అసెంబ్లీలో బిల్లు పెట్టే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మూడు రాజధానుల నిర్మాణం వైసీపీ విధానమన్నారు. జిల్లా పునర్విభజనపై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందన్నారు. ఉగాదికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమవుతుందన్నారు.
పాలసముద్రంలో నాసిన్ అకాడమీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ
అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్) అకాడమీ భవనాలకు 500 ఎకరాలు భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే 500 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు. నాసిన్ అకాడమీ భవనాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి శంకర్ నారాయణ ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు గంటలపాటు జరిగిన కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పాల్గొన్నారు.