Breaking News Live: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 03 Dec 2021 07:02 PM
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్ 

శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పల్లిసారధి గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. రాత్రి వేళల్లో ఊరిలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఇటీవల మందస మండలం అంబుగాం గ్రామంలో ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  

ఫుడ్ పాయిజన్ అయ్యి 45 మంది విద్యార్థినులకు అస్వస్థత

కరీంనగర్ జిల్లా చొప్పదండి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది.  45 మంది అమ్మాయిలకు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో క్యాబేజీ కర్రీ, గుడ్డు ,చారు మజ్జిగ తిన్న తర్వాత కడుపు నొప్పి వాంతులతో విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే వారిని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 37 మంది విద్యార్థులు కోలుకున్నారు. ఎనిమిది మంది పిల్లలకు ఇంకా వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఎవరికీ ఏం ప్రమాదం లేదని ప్రిన్సిపల్ తెలిపారు. 


 

 ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరికి పాజిటివ్

నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. కోటగల్లీలోని బీసీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ లో గత 2 రోజులుగా కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలికి, మోపాల్ కు చెందిన 4వ తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. ఈ రెసిడెన్షియల్ స్కూల్ లో మొత్తం 152 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని నిర్థారించారు. 

నాన్-ఎమర్జెన్సీ సేవలు బహిష్కరించిన ఉస్మానియా జూ. డాక్టర్లు

FAIMA, FORDA మరియు అన్ని ఇతర రాష్ట్రాల RDA లకు మద్దతుగా రాష్ట్ర ఆధ్వర్యంలో నడిచే గాంధీ హాస్పిటల్ మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) తెలంగాణ జూనియర్ వైద్యులు ఈ రోజు నుండి నాన్-ఎమర్జెన్సీ సేవలను (OPDలు, ఎలక్టివ్ సర్వీసెస్, వార్డులు) బహిష్కరించారు. కేంద్రం ద్వారా NEET-PG కౌన్సెలింగ్‌లో జాప్యం చేస్తోంద‌ని వారు ఆరోపిస్తున్నారు.

24 గంటల్లో సమస్య పరిష్కరిస్తాం.. టీటీడీ FMS కాంట్రాక్ట్ కార్మికురాలితో సీఎం జగన్

తిరుపతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ రెండో రోజు పర్యటిస్తున్నారు. టీటీడీ ఎఫ్.ఎం.ఎస్ కాంట్రాక్ట్ కార్మికురాలు రాధ సీఎం జగన్ ని కలిశారు. ఏడు రోజులుగా ఏడి బిల్డింగ్ ముందు కార్మికులు ధర్నా చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నాం అన్న అంటూ జగన్ కు తమ బాధను కార్మికురాలు రాధ తెలిపారు. ఆడపడుచులకు అన్న నేను ఉన్నానంటూ  సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. 24 గంటల్లో మీ సమస్యను పరిష్కరిస్తాం అంటూ తల మీద ఓట్టేసిన సీఎం జగన్. జగనన్న హామీతో సంతోషం ఒక వైపు అయితే భయం మరోవైపు అని కార్మికురాలు చెబుతోంది. మడమ తిప్పను మాట తప్పను అనే జగనన్నపై నమ్మకం ఉందన్నారు. మా కష్టాలు తీరే వరకూ తిరుమల కొండ ఎక్కము అని కార్మికురాలు రాధ అన్నారు. కాంట్రాక్టర్స్ నుండి తమను కాపాడాలంటూ సీఎం జగన్ కు కార్మికురాలు రాధ విన్నవించుకున్నారు.

శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు

చంచల్ గూడ జైలు నుండి  శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వందల కోట్ల మోసాలకు పాల్పడిన కేసులో శిల్పా చౌదరి, ఆమె భర్త నిందితులుగా ఉన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పలువురు వ్యాపారవేత్తలను అధిక వడ్డీల పేరుతో ఆమె మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన 20న..

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 20న శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు రానున్నారు. నాలుగు రోజులపాటు బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ క్రమంలో రాష్ట్రపతి నిలయంలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో ఆయా విభాగాల అధికారులు నిమగ్నం అయ్యారు. రాష్ట్రపతి కోసం రాష్ట్రపతి నిలయాన్ని ఆనుకొని ఉన్న ఈఎంఈ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రత్యేక హెలీప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. 20న రాష్ట్రపతి న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్సు స్టేషన్‌లో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. అయితే, అత్యవసర పరిస్థితుల కోసం అధికారులు ప్రత్యామ్నాయంగా హెలీప్యాడ్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి బందోబస్తు ఏర్పాట్లతోపాటు రూట్‌ కాన్వాయ్‌, వసతుల ఏర్పాట్ల కోసం కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాక్‌ డ్రిల్‌ కూడా నిర్వహించారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నిజపాద సేవలో ఏపీ మంత్రులు పేర్ని నాని, వేణు గోపాలకృష్ణలు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు..

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్

తిరుపతిలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా తిరుపతిలోని కృష్ణానగర్‌ను సీఎం పరిశీలించారు. బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. వరద నష్టాలపై ఫోటోలను కూడా సీఎం చూశారు. సీఎంతో పాటుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్.కే.రోజా, అధికారులు కూడా ఉన్నారు.

బ్లేడుతో గొంతు కోసుకున్న యువకుడు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు తనతో సరిగ్గా మాట్లాడటం లేదని 21 ఏళ్ల నరేశ్ అనే యువకుడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. దీంతో నరేశ్‌కు ప్రాణాపాయం తప్పింది. అత్యుత్తమ చికిత్స నిమిత్తం నరేశ్‌ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Background

శిల్పా చౌదరికి బెయిల్ నిరాకరణ
సంపన్న మహిళలకు రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన శిల్పా చౌదరికి ఉప్పర్‌పల్లి కోర్టు బెయిల్‌ నిరాకరించింది. కానీ, ఆమె భర్తకు మాత్రం ఇచ్చింది. పోలీసులు ఆ వెంటనే మరో చీటింగ్‌ కేసులో ఆయనను జైలుకు తరలించారు. నార్సింగి పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ పట్ల కోర్టు సానుకూలంగా స్పందించింది. శిల్పా చౌదరిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్న శిల్పా చౌదరిని పోలీసులు శుక్రవారం ఉదయం తమ కస్టడీకి తీసుకోనున్నారు.


పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నేడు ఇంధన ధరలు నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.107.69 అయింది. డీజిల్ ధర రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరుకు రూ.0.54 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.110.91 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.50 పైసలు పెరిగి రూ.96.96గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.


బంగారం ధరలు..
ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,600 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,650 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,600 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,650గా ఉంది. 


Also Read: ఏపీ, ఒడిశాపై జవాద్ తుపాను ప్రభావం... 100కు పైగా రైళ్ల రద్దు... ప్రధాని మోదీ సమీక్ష


Also Read: New Suzuki Alto: సుజుకీ కొత్త ఆల్టో ఇదే.. అదిరిపోయే డిజైన్.. లాంచ్ ఎప్పుడంటే?


Also Read: TTD EO: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది లేదు.. మెుదటి ఘాట్ రోడ్డులో వాహనాలు నడుస్తున్నాయి


Also Read: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.