హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించినా మందుబాబుల తీరు మారలేదు. మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31న నిర్వహించిన తనిఖీలలో 1,184 మంది పట్టుబడ్డారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరధిలో మంగళవారం 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు అంటే ఇంటి వద్ద ప్రశాంతంగా జరుపుకోవాలని, లేకపోతే మద్యం సేవించినా.. డ్రైవింగ్ చేయడానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని ముందుగానే హెచ్చరించారు. క్యాబ్ లాంటివి బుక్ చేసుకుని ఇళ్లకు వెళ్లాలని, లేక తమకు చెప్పినా ఏదో విధంగా మందుబాబులు సురక్షితంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. 


ఈస్ట్ జోన్‌లో బ్రీత్ అనలైజర్లు పగిలేలా తాగిన మందుబాబులు..!
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జోన్‌ల వారిగా చూస్తే అత్యధికంగా ఈస్ట్‌ జోన్‌లో బ్రీత్ అనలైజర్లు పగిలేలా మందుబాబులు తాగేశారు. ఈస్ట్ జోన్‌లో 236 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. సౌత్‌ ఈస్ట్ జోన్‌లో 192 కేసులు, వెస్ట్ జోన్‌, సౌత్‌ వెస్ట్ జోన్‌లో 179 కేసులు, హైదరాబాద్ నార్త్‌ జోన్‌లో 177, హైదరాబాద్ సెంట్రల్‌ జోన్‌లో 102 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


న్యూ ఇయర్ అంటేనే హైదరాబాద్‌లో గుర్తుకొచ్చేవి రెండంటే రెండే. ఒకటి మందు, రెండు బిర్యానీ. కొత్త సంవత్సరం సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని, బాధ్యతగా వ్యవహరించకపోతే కేసుల్లో ఇరుక్కుంటారని పోలీసులు హెచ్చరించినా మందుబాబులు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా తాగి వాహనాలు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కున్నారు. న్యూ  ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు హైదరాబాద్ పరిధిలో 1,184, రాచకొండ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే వారి ప్రాణాలతో పాటు పాదచారులు, ఇతర వాహనదారుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అనునిత్యం పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రభాస్, నాని, అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం తెలుగు ప్రజలను, తమ అభిమానులను డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తూనే ఉంటారు.


డ్రగ్స్ టెస్టులో ఒకరికి పాజిటివ్
డ్రగ్స్ కేసులో దొరికితే మాత్రం మామాలుగా ఉండదు, జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నార్కోటిక్స్ బ్యూరో అధికారుల నిర్వహించిన టెస్టులో ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. డ్రంక్ ఎండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు టీజీన్యాబ్ అధికారులు. నాగార్జున రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ రావడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎక్కడ గంజాయి, మత్తు పదార్థాలు కొనుగోలు చేశాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.