Hyderabad Regional Ring Road: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ (Hyderabad Regional Ring Road) నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 162 కిలోమీటర్లు ఉన్న ఈ ఫోర్‌లేన్ రహదారికి రూ.8,500 కోట్లు అవుతుందని నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా (NHAI) ఇదివరకే అంచనా వేసింది. ఈ మేరకు డీపీఆర్‌లో విషయాలు పొందుపరిచింది. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో నిర్మించే 4 వరుసల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు ఇంటర్ లింక్ కానున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వే (Greenfiled Expressway)గా వ్యవహరించే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉండే మార్గాలతో సిటీలోకే కాదు, సిటీ శివారులోకి సైతం ఎంటర్ అవకాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు అని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ శివార్లలోకి సైతం రాకుండానే ఆర్ఆర్ఆర్ నుంచి పలు జిల్లా కేంద్రాలకు కూడా నేరుగా రాకపోకలు సాగించవచ్చు. దాంతో అంతర్రాష్ట్ర వాహనాలకు ట్రాఫిక్ సమస్యతో పాటు దూరం సైతం తగ్గనుంది. దీని ఫలితంగా హైదరాబాద్ రీజియన్‌లో సైతం ట్రాఫిక్ కష్టాలకు కొంతమేర ఊరట లభించనుంది. ఆర్ఆర్ఆర్ నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులకు కనెక్టివిటీ పెరగడంతో భవిష్యత్తులో ఇది ఎకనామిక్ కారిడార్‌గా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. పదకొండు చోట్ల జాతీయ, రాష్ట్ర రహదారులతో ఆర్ఆర్ఆర్ అనుసంధానం అవుతున్న జిల్లాల్లోనూ మరింత వృద్ధి జరగనుంది. మెట్రో రైలు, ఫ్లై ఓవర్లు, ఓఆర్ఆర్‌తోనే హైదరాబాద్ రూపురేఖలు ఇలా మారిపోతే.. ఇక రీజనల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ శివారు ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోతాయి
ఐదు ప్యాకేజీల్లో ఉత్తర భాగం పనులు
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులను మొత్తం 5 ప్యాకేజీల్లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారత్‌మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా (NHAI) దీన్ని నిర్మించనుంది. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం డిజైన్ చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR)తో పాటు జాతీయ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే రాష్ట్ర రహదారులు, మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేస్తారు.
ఆర్ఆర్ఆర్ మొత్తం 11 ఇంటర్‌ఛేంజ్‌లతో పాటు టోల్‌ప్లాజాలు, సర్వీసు రోడ్లు, రెస్ట్‌రూంలు, బస్‌బేలు, ట్రక్ బేలు నిర్మించేలా ప్లానింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నాలుగు లేన్లుకు నిర్మిస్తుండగా.. భవిష్యత్తులో అప్పటి అవసరాలకు తగ్గట్లుగా 8 లేన్లుగా విస్తరించే అవకాశం ఉంది. భూసేకరణ చేసి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా రీ డిజైన్ చేయనున్నారు.