Ind Vs Aus 5th Test; భారత జట్టుతో మెల్ బోర్న్ లో జరిగిన నాలుగో టెస్టులో గెలిచి జోరు మీదున్న ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ ఈనెల 3 నుంచి జరిగే ఐదో టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు పక్కటెముకల గాయం బారిన పడిన మిషెల్ స్టార్క్.. ఆ గాయానికి చికిత్స తీసుకుంటూనే మ్యాచ్ లో ఆడాడు. రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన భారత స్టార్ విరాట్ కోహ్లీ వికెట్ తీసి సత్తా చాటాడు. అయితే అతని గాయం ఇంకా మానకపోవడంతో ఐదో టెస్టులో బరిలోకి దిగడంలో అనుమానాలు ముసురుకున్నాయి. దీనిపై ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స కేరీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్టార్క్ బరిలోకి దిగుతాడు..
నిజానికి స్టార్క్ కు అయిన గాయం పెద్దదే అయినప్పటికీ, దాని నుంచి అతను కోలుకుని ఐదో టెస్టులో పునరాగమనం చేస్తాడని కేరీ విశ్వాసం వ్యక్తం చేశాడు. తనతో చాలాకాలం నుంచి ఆడుతున్నానని, అతని ఫిట్ నెస్ లెవల్ అద్భుతంగా ఉంటాయని గుర్తు చేశాడు. పక్కటెములక నొప్పి బాధిస్తున్నప్పటికీ, నాలుగో టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు. గాయం నుంచి కోలుకుని, ఐదో టెస్టుకు అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాడు. మరోవైపు ఒకవేళ స్టార్క్ గాయం కారణంగా దూరమైతే అతని స్థానంలో పేసర్ జై రిచర్డ్ సన్ జట్టులోకి వచ్చే అవకాశముంది. అయితే అతను చివరగా డిసెంబర్ 2021లో జాతీయ జట్టు తరపున ఆడాడు. అయితే తాజా ఊహగానాలను అతను కొట్టిపారేశాడు. ఐదో టెస్టు గురించి తననెవరు సంప్రదించలేదని పేర్కొన్నాడు. ఒకవేళ అవకాశం దొరికితే రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు.
సిడ్నీ టెస్టులో గెలుపు తప్పనిసరి..
మరోవైపు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తన వద్దే ఉండాలంటే సిడ్నీ టెస్టులో భారత్ కు గెలుపు తప్పనిసరి. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే, 2-2తో సిరీస్ సమం అవుతుంది. దీంతో ప్రస్తుతం ట్రోఫీ భారత్ ఆధీనంలోనే ఉంది కాబట్టి, మరోసారి భారత్ ఆ ట్రోఫీని దక్కించుకుంటుంది. ఎందుకంటే సిరీస్ డ్రా అయితే అంతకుముందు ఎవరైతే గెలిచారో, వారి వద్దే సిరీస్ ఉంటుంది. దీంతో వరుసగా ఐదోసారి ఈ ట్రోఫీని తన సొంతం చేసుకుంటుంది. అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసులోనూ భారత్ నిలబడుతుంది.
ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్ కి వెళ్లింది. రెండోస్థానం కోసం భారత్, ఆసీస్, శ్రీలంక మధ్య పోటీ ఉంది. మరోవైపు ఈ టెస్టు గెలవడం భారత స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు తప్పనిసరి. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న ఈ జంట.. ఈ మ్యాచ్ లో డ్రా అయినా, ఓడిపోయినా టెస్టు కెరీర్ అంతమయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఈ సిరీస్ లో ఘోరంగా విరిద్దరూ విఫలమవుతున్న సంగతి తెలిసిందే.