Ayush Mhatre News: దేశవాళీ క్రికెట్లో నయా సంచలనం నమోదైంది. తాజాగా లిస్ట్-ఏ క్రికెట్ భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేరిటి ఉన్న వరల్డ్ రికార్డును ముంబై ప్లేయర్ ఆయుష్ మాత్రే బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత పిన్న వయసు (17 ఏళ్ల 168 రోజులు)లో 150 పరుగులు చేసిన క్రికెటర్ గా మాత్రే రికార్డులకెక్కాడు. నాగాలాండ్ మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన మాత్రే.. భారీ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డును జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజుల వయసులో ఉన్నప్పుడు నమోదు చేయగా, తాజాగా అది కనుమరుగైంది.
మాత్రేపై సీఎస్కే కన్ను..
మరోవైపు దేశవాళ్లీల్లో పాటు ఇటీవల జరిగిన అండర్-19 ఆసియాకప్ లో రాణించిన మాత్రేపై ఆల్రెడీ మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నజర్ పెట్టింది. గతనెలలో జెడ్డాలో జరిగిన మెగావేలానికి ముందు నిర్వహించిన సెలక్షన్ ట్రయల్ కు అతడిని ఆహ్వానించింది. అందుకుగాను ముంబై క్రికెట్ సంఘం నుంచి కూడా అనుమతి తెచ్చుకుంది. అయితే అనూహ్యంగా ఐపీఎల్లో మాత్రే అమ్ముడు పోలేదు. అయితే ఇప్పటికే సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కనుసన్నల్లో పడిన మాత్రే.. త్వరలోనే ఆ జట్టు తరపున ఆడే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. ఆసియాకప్ లో విశేషంగా రాణించిన మాత్రే..44కి పైగా సగటుతో 176 పరుగులు చేసి ఇంప్రెస్ చేశాడు.
ముంబై భారీ విజయం..
విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై భారీ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 403 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆయుష్ (117 బంతుల్లో 181, 15 ఫోర్లు, 11 సిక్సర్లు) బౌండరీల వర్షంతో చెలరేగాడు. మరో ఓపెనర్ రఘువంశీతో కలిసి తొలి వికెట్ కు 156 పరుగుల భారీ స్కోరు జోడించి గట్టి పునాది వేశాడు. ఆది నుంచే ఎదురుదాడికి దిగిన మాత్రే.. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకు పడుతూ, భారీ గా పరుగులు సాధించాడు. అతని స్కోరులో సెంచరీకిపైగా పరుగులు బౌండరీల రూపంలోవచ్చినవే కావడం విశేషం. పసికూన అయిన నాగాలాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అతనితోపాటు ఓపెనర్ అంగ్ క్రిష్ రఘువంశీ (56), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (79 నాటౌట్) రాణించారు. మాత్రే ఇచ్చిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకున్న ముంబై, భారీ స్కోరు చేసి ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. చివర్లో శార్దూల్ ధనాధన్ ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 28 బంతుల్లోనే 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఛేదనలో ఓవర్లన్నీ ఆడి 214/9తో నిలిచి 189 పరుగులతో నాగాలాండ్ ఓడిపోయింది. శార్దూల్ మూడు వికెట్లతో రాణించాడు. రోస్టన్ దియాస్, సుయాంశ్ షెడ్గే రెండేసి వికెట్లతో సత్తా చాటారు.