Cricket News: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఓడిపోయినప్పటికీ, భారత ఆటగాళ్లు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. నాలుగో టెస్టులో సత్తా చాటిన ఈ ఇద్దరి పేర్లు.. మెల్బోర్న్ హానరరీ బోర్డులో చోటు దక్కింది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మొత్తం 9 వికెట్లతో మెరిశాడు. ఇక నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ లోనే అరంగేట్రం చేసి విశేషంగా రాణిస్తున్నాడు. ఇక ఈ టెస్టులో కీలకదశలో సెంచరీ (114) చేసి జట్టును ఆదుకున్నాడు. అటు ఐదు వికెట్ల ప్రదర్శనకు గాను బుమ్రా, ఇటు సెంచరీ చేసినందుకుగాను నితీశ్ లకు తాజాగా ఈ గౌరవం దక్కింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలోపోస్టు చేయగా, వైరలైంది.
ఈ ఏడాది అత్యంత విజయవంతమైన బౌలర్..
ఈ ఏడాది సూపర్ టచ్ లో ఉన్న బుమ్రా.. అత్యంత విజయవంతమైన టెస్టు బౌలర్ గా నిలిచాడు. 13 మ్యాచ్ లు ఆడిన బుమ్రా.. 14.92 సగటుతో 71 వికెట్లు తీశాడు. అలాగే నాలుగో టెస్టులోనే 200 వికెట్ల మైలురాయిని దాటాడు. వాకర్ యూనిస్ (7725), డేల్ స్టెయిన్ (7848), కగిసో రబాడ (8153) తర్వాత అతి తక్కువ బంతులు (8484)లోనే ఈ ఘనత సాధించిన బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఇక బాక్సింగ్ డే టెస్టుల్లోనూ బుమ్రా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో కేవలం 14.66 సగటుతో 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఈ సిరీస్ లోనూ అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు. మొత్తంగా నాలుగు టెస్టులు కలిపి 30 వికెట్లు తీశాడు.
అదరగొడుతున్న నితీశ్..
ఈ ఏడాదే ఐపీఎ‘ల్లో అరంగేట్రం చేసి సత్తా చాటి, జాతీయ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్.. అక్కడ సత్తా చాటి అనూహ్యంగా టెస్టు జట్టులోకి అరంగేట్రం చేశాడు. కష్టమైన పెర్త్ వికెట్ పై 41 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆ మ్యాచ్ లో భారత్ కేవలం 150 పరుగులు చేయగా, అందులో నితీశే టాప్ స్కోరర్ కావడం విశేషం. ఆ తర్వాత నుంచి తను బ్యాటింగ్ లో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా 41, 38 నాటౌట్, 42, 42, 16 పరుగులతో మెల్ బోర్న్ టెస్టులో అడుగుపెట్టాడు. ఇక మ్యాచ్ లో ఒక దశలో 191/6తో ఫాలో ఆన్ గండం ప్రమాదంలో ఉన్న భారత్ ను తన కెరీర్లో తొలి సెంచరీతో ఆదుకున్నాడు. అతని చలవతోనే ప్రత్యర్థికి భారీగా ఆధిక్యాన్ని సమర్పించుకోకుండా భారత్ తప్పించుకోగలిగింది. కీలకదశలో వాషింగ్టన్ సుందర్ తో కలిసి 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి సత్తా చాటాడు. దీంతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్ లో 1-2తో వెనుకబడిన భారత్ జనవరి 3 నుంచి జరిగే సిడ్నీ టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో నిలిచింది. అప్పుడే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.