Virat Kohli News: గతకొంతకాలంగా టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న భారత వెటరన్ ద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై వరుసగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్లో వారిద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా వీరిద్దరి టెస్టు భవితవ్యంపై స్పందించాడు. తమంతట తామే టెస్టుల నుంచి వైదొలగాలని, లేకపోతే సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఇక ప్రతిష్టాత్మక బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో వీరిద్దరూ బ్యాట్లేత్తారు. విరాట్ ఒక మ్యాచ్ లో అజేయ సెంచరీ చేయగా, మిగతా ఆరు ఇన్నింగ్స్ లో మాత్రం కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రోహిత్ మాత్రం ఐదు ఇన్నింగ్స్ ఆడితే కేవలం 31 పరుగులు మాత్రమే సాధించాడు. 


గల్లీ బౌలర్లు కూడా వారిని ఔట్ చేయగలరు..


మెల్ బోర్న్ టెస్టులో అందరూ రిషభ్ పంత్ గురించే మాట్లాడుతున్నారని, అయితే అతని సహజ శైలిలో ఆడాడని ఖన్నా అన్నాడు. గత కొంతకాలంగా జట్టు ఏపరిస్థితిలో ఉన్నా అతను అలానే ఆడుతున్నాడని తెలిపాడు. అయితే అతని కంటే ముఖ్యంగా రోహిత్, కోహ్లీ గురించే మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఫామ్ రిత్యా కోహ్లీ, రోహిత్ లకు జట్టులో చోటు ఉండకూడదని ఖన్నా వ్యాఖ్యానించాడు. వారు బ్యాటింగ్ టచ్ కోల్పోయారని, ప్రస్తుతం వారిని గల్లీ బౌలర్లు కూడా ఔట్ చేయగలరని ధ్వజమెత్తాడు. ఇప్పటికైనా స్పందించి, సిడ్నీలో జరిగే ఐదో టెస్టులో వీరిద్దరూ స్వచ్ఛందంగా రిజర్వ్ బెంచ్ కే పరిమితమైతే మంచిదని, లేకపోతే సెలెక్టర్లే ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. యువ ప్లేయర్లను జట్టులోకి తీసుకొస్తే, మంచిదని, పెర్త్ టెస్టులో యువ ప్లేయర్ల చలవతోనే గెలిచామని పేర్కొన్నాడు. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా అన్ని రంగాల్లో రాణించి, ఆసీస్ ను ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు.


నిరాశ పరుస్తున్న గణాంకాలు..
రోహిత్, విరాట్ క్రికెట్లో చాలా ఎత్తుగా ఎదిగారు కానీ, ఈ దశాబ్దపు గణాంకులు చూస్తే నిరాశ కలుగక మానదు. 2020 నుంచి ఆడిన 37 టెస్టుల్లో 64 ఇన్నింగ్స్ ల్లో బరిలోకి దిగిన కోహ్లీ కేవలం 1964 పరుగులే చేశాడు. సగటు కేవలం 31.67 ఉండగా, అందులో మూడు సెంచరీలు, తొమ్మిది ఫిఫ్టీలు ఉండటం విశేషం. ఇక ప్రస్తుత ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్లో 12 మ్యాచ్ లాడిన కోహ్లీ.. 21 ఇన్నింగ్స్ లో బరిలోకి దిగి 36.15 గటుతో 687 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రోహిత్ ఈ సీజన్లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆ తర్వాత జరిగిన కివీస్, ఆసీస్ సిరీస్ ల్లో ఘోరంగా విఫలమై విమర్శల జడివానకు గురవుతున్నాడు. అలాగే సారథ్యంలోనూ మెరుపులు లేకపోవడంతో జట్టు పరాజయం విషయంలో తనే దోషిగా నిలబడాల్సి వస్తోంది. మరోవైపు సిడ్నీ టెస్టు జనవరి మూడు నుంచి ప్రారంభమవుతుంది. ఆ టెస్టులో టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.


Also Read: WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..