WTC Points Table 2023-25 Updated: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలను భారత్ క్లిష్టం చేసుకుంది. ఇక జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితిలో నిలిచింది. మరోవైపు ఆదివారం పాకిస్థాన్‌పై 2 వికెట్లతో గెలిచిన దక్షిణాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ఫైనల్ పోరు వచ్చే జూన్‌లో లండన్‌లోని ప్రముఖ లార్డ్స్ మైదానంలో జరుగుతుంది.
సిడ్నీ గెలిస్తే ముందంజ..
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ముందు ఐదో టెస్టులో భారత్ గెలుపొందాలి. ఆ తర్వాత ఆసీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో కచ్చితంగా 2-0తో శ్రీలంక గెలుపొందాలి. అందులో ఒక్కదానిలో అయినా ఆసీస్ గెలిచినా, భారత కథ కంచికి చేరుతుంది. మరోవైపు లంకకు కూడా చాన్స్ ఉంది. ఒకవేళ సిడ్నీ టెస్టు డ్రా అయితే అప్పుడు రేసు నుంచి భారత్ నిష్క్రమిస్తుంది. ఆసీస్‌తో సిరీస్‌ను 2-0తో గెలిస్తే లంకకు ఫైనల్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఆ సిరీస్‌లో సాధించిన పాయింట్లను బట్టి, ఫైనల్ బెర్త్‌కు వెళ్లడమనేది ఆధారపడి ఉంది.
సినియర్ల వైఫల్యంతోనే..
నిజానికి ఆసీస్ కంటే ముందే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు సాధించే అవకాశం న్యూజిలాండ్ పర్యటన రూపంలో దక్కింది. ఆ సిరీస్ తొలి టెస్టులో టాస్ నెగ్గి కూడా బౌలింగ్ ఎంచుకుని చేజేతులా మ్యాచ్‌ను కివీస్ అప్పజెప్పింది. అప్పటి నుంచే భారత్ డౌన్ ఫాల్ స్టార్టయ్యింది. ఆ సిరీస్‌ను ఏకంగా 0-3తో కోల్పోయిన భారత్.. ఆ తర్వాత ఆసీస్ పర్యటనలో నాలుగు టెస్టులాడి రెండు టెస్టుల్లో ఓడిపోయింది. కివీస్ సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ సిరీస్‌లో భారత సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. ఇక తాజాగా జరిగిన కీలకమైన నాలుగో టెస్టులో కూడా వీరిద్దరూ దారుణంగా ఆడారు. చెత్త షాట్లతో వికెట్లు పారేసుకుని, జట్టును ఓటమి పాలయ్యేలా చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరకపోతే, రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎసరు రావడంతో పాటు అతనికి జట్టులో చోటు కూడా కష్టమవుతుంది. ఇక కోహ్లీకి మరికొంత సమయం దక్కే అవకాశముంది. ఏదేమైనా వరుసగా మూడుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలన్న భారత కల.. మెల్ బోర్న్ ఓటమితో దాదాపుగా మసకబారిందనే చెప్పవచ్చు. తాజా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా 66.67 పాయింట్ల శాతంతో టాప్ ప్లేస్ దక్కించుకోగా, ఆసీస్.. 61.46, భారత్ 52.78, శ్రీలంక 45.45 పాయింట్ల శాతంతో ఉన్నాయి.