BGT 2024 Update: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. సోమవారం ఐదో రోజు పూర్తి రోజు బ్యాటింగ్ చేయలేక చతికిల పడింది. ముఖ్యంగా సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (9), విరాట్ కోహ్లీ (5) ఘోరంగా విఫలం కావడంతో జట్టు ఓటమి చెందిందని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఈ సిరీస్ లో ఏ మాత్రం ప్రభావం చూపలేని ఈ ఇద్దరిపై వేటు వేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.


ముఖ్యంగా రోహిత్ శర్మ అటు బ్యాటింగ్ లో ఇటు కెప్టెన్సీలో రాణించలేకపోతున్నాడని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐదో రోజు 340 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 79.1 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది. దీంతో 184 పరుగులతో ఓటమిపాలైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (208 బంతుల్లో 84, 8 ఫోర్లు) ఓ వైపు పరాజయాన్ని తప్పించడానికి చివరికంటా ట్రై చేసినా, అతనికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. దాదాపు 310 నిమిషాల పాటు మారథాన్ బ్యాటింగ్ చేసి జట్టును ఓటమి నుంచి తప్పించేందుకు విఫలయత్నం చేశాడు. బౌలర్లలో  కమిన్స్, బోలాండ్ మూడేసి వికెట్లతో సత్తా చాటారు., లయన్ కు రెండు వికెట్లు దక్కాయి. హెడ్, స్టార్క్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆసీస్ 5 టెస్టుల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.


 






 


మలుపు తిప్పిన పంత్ వికెట్..
నిజానికి ఈ ఓటమికి ఒక రకంగా ప్రధాన కారణంగా వికెట్ కీపర్ పంత్ (104 బంతుల్లో 30, 2 ఫోర్లు) ను కూడా చెప్పుకోవచ్చు. టీ విరామం వరకు ఓపికగా ఆడిన పంత్.. ఆ తర్వాత హెడ్ బౌలింగ్ లో భారీ షాట్  కు ప్రయత్నించి ఔటయ్యాడు. నిజానికి అప్పుడున్న పొజిషన్లో ఆ షాట్ ఆడే అవసరం లేదు. అయినా తన పాత అలవాటు ప్రకారం వికెట్ ను పంత్ చేజేతులా పారేసుకున్నాడు. మూడో సెషన్ నుంచి భారత పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా ఔట్ అయి పోవడంతో పరాజయ లాంఛనం పూర్తయ్యింది. 


అనూహ్య బౌన్స్ తో ఆసీస్ కు ఫాయిదా..
ఇక టీ సెషన్ తర్వాత వికెట్ కాస్త బౌలింగ్ కు అనుకూలించడంతో ఆసీస్ బౌలర్లు పూర్తి సత్తా చాటారు. తొలుత రవీంద్ర జడేజా (2)ను బోలాండ్ ను అనూహ్య బౌన్సర్ తో బోల్తా కొట్టించాడు. ఇక తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (1) లయన్ వేసిన బంతి అనూహ్యంగా స్పిన్ అవడంతో స్లిప్పులో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (45 బంతుల్లో 5 నాటౌట్) తో కలిసి జైస్వాల్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే డ్రింక్స్ విరామం తర్వాత స్వయంగా బౌలింగ్ కు దిగిన కమిన్స్ చక్కని బంతితో జైస్వాల్ ను ఔట్ చేశాడు. నిజానికి జైస్వాల్ క్యాచ్ ఔటయినట్లు ఆసీస్ ప్లేయర్లు అప్పీల్ చేయగా, అంపైర్ తిరస్కరించాడు. అయితే రివ్యూకు వెళ్లి మరీ కమిన్స్ ఫలితాన్ని సాధించాడు. ఆ తర్వాత టెయిలెండర్ల వికెట్లను పడగొట్టిన ఆసీస్.. ఈ టెస్టును కైవసం చేసుకుంది. సుందర్ చివరికంటా అజేయంగా నిలిచాడు.


ఈ మ్యాచ్ విజయంతో సిరీస్ లో 2-1తో తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. అటు ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇటు సూపర్ కెప్టెన్సీతో సత్తా చాటిన కమిన్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కి వెళ్లేందుకు ఆసీస్ కు మరింతగా దారి తెరుచుకుంది. చివరిటెస్టును కనీసం డ్రా చేసుకుంటే చాలు, దాదాపుగా ఫైనల్ కు చేరుకుంటుంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కాలంటే సిడ్నీ టెస్టులో భారత్ విజయం సాధించడంతోపాటు శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ ను ఆసీస్ ఓడిపోవాలి. మొత్తానికి మెల్ బోర్న్ ఓటమితో టీమిండియా.. అటు బీజీటీ సిరీస్ ను పదేళ్ల తర్వాత కోల్పోయే స్థితిలో నిలవడంతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. 






Read Also: Boxing Day Test Record: 87 ఏళ్ల బ్రాడ్ మన్ రికార్డు బద్దలు.. ప్రేక్షకులు పోటెత్తడంతో బాక్సింగ్ డే టెస్టు కొత్త రికార్డు