Sydney Test News: భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తన ఓపికను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్లేయర్లకు నచ్చినవిధంగా ఆడేందుకు అనుమతిచ్చిన ఆయన.. ఇకపై తను వేసే ప్రణాళికలను కచ్చితంగా ఫాలో కావల్సిందేనని అల్టిమేటం జారీ చేసినట్లు పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మెల్ బోర్న్ టెస్టులో నిర్లక్ష్యపూరితంగా వికెట్ పారేసుకున్న ప్లేయర్లపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరిగిన తర్వాత అనంతరం భేటీలో ఇప్పటివరకు చేసింది చాలాని అన్నట్లు తెలిసింది. తను కోచ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆరు నెలలపాటు ప్లేయర్లు తమకు తగిన విధంగా గేమ్ ప్లాన్ రూపొందించుకునేందుకు చాన్స్ ఇచ్చినట్లు, అయితే వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఇకపై తాను రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తన ప్రణాళికలను అమలు చేయలేని ఆటగాళ్లను సాగనంపేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం..


ముఖ్యంగా ఆ ముగ్గురిపై ఆగ్రహం..
మెల్ బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పట్టుదలగా ఆడి కనీసం డ్రా చేయగలిగే మ్యాచ్ ను కొంతమంది ప్లేయర్ల బాధ్యతారాహిత్యమైన ఆటతీరుతో ఓడిపోయేలా చేశారని గంభీర్ మండిపడుతున్నాడు. ముఖ్యంగా పదే పదే ఆఫ్ స్టంప్ కు ఆవతలగా వచ్చిన బంతులకు ఔటవుతున్న కోహ్లీ.. ఈ మ్యాచ్ లోనూ ఎనిమిదో వికెట్ పై సంధించిన బంతిని వేటాడి ఔట్ కావడంపై గుర్రుగా ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ.. 40 బంతులపాటు ఓపికగా ఆడి, ఒక చెత్త షాట్  కు వికెట్ పారేసుకోవడంపైనా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు టీ సెషన్ వరకు సంయమనంతో ఆడిన వికెట్ కీపర్ రిషభ్ పంత్.. మూడో సెషన్ లో చెత్త షాట్ కు ప్రయత్నించి వికెట్ పారేసుకోవడం భారత్ ఓటమికి దారులు తెరించిందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. తను రూపొందిస్తున్న గేమ్ ప్లాన్ కు ఆటగాళ్ల రెస్పాన్స్ కు మధ్య చాలా తేడా ఉన్నట్లు గంభీర్ అసహనంగా ఫీలవుతున్నాడు. ఇకపై తను చెప్పినట్లు ఆడాల్సిందేనని గట్టి వార్నింగ్ సూచనలు జారీ చేసినట్లు తెలిసింది.


షాకింగ్ ఓటములు..


ఇక గంభీర్ కోచింగ్ భారత జట్టు కొన్ని షాకింగ్ ఓటములను ఎదుర్కొంది. పసి కూన లాంటి శ్రీలంక జట్టు తన సొంతగడ్డపై 2-0తో వన్డే సిరీస్ ను గెలుచుకుంది. ఇక దశబ్ధాల పాటు భారత గడ్డపై టెస్టు విజయాన్ని ఎరుగని న్యూజిలాండ్ ఏకంగా 3-0తో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసి సిరీస్ ను ఎగరేసుకు పోయింది. అలాగే ఇప్పుడు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆసీస్ కు కోల్పోయే స్థితిలో నిలవడంతోపాటు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదంలో టీమిండియా పడింది. ఇక ఈనెల 3 నుంచి సిడ్నీలో జరిగే ఐదో టెస్టులో గెలిస్తేనే అటు బీజీటీతోపాటు ఇటు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ నిలుస్తుంది. 


Also Read: World Record Alert: ధోనీని మెప్పించిన కుర్రాడు.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు... త్వరలోనే సీఎస్కే తరపున బరిలోకి..!!