AP CM Chandrababu first sign in 2025 | అమరావతి: నూతన సంవత్సరం 2025 తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ది చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ (AP CMRF) నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ. 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి.
ఏడు నెలల్లో పేదలకు రూ. 120 కోట్లకు పైగా లబ్ధి
గత ఏడాది జూన్‌లో అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదలకు ఇచ్చారు. 7,523 మందికి లబ్ది కలిగింది. బుధవారం నాడు సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం రూ. 124.16 కోట్లకు చేరింది. కూటమి ప్రభుత్వంలో మొత్తంమ్మీద 9,123 మంది సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రయోజనం పొందినట్లయ్యింది.
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త రెడీ!
నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం కన్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ప్రచారంలో ఉంది. పీఆర్సీతో పాటు ఉద్యోగులకు మధ్యంతర భృతిపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. జనవరి 2న గురువారం నాడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, ఐఆర్ లపై నిర్ణయాలకు ఆమోద ముద్ర పడనుంది. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ లో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పది రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని నేడు రాష్ట్రానికి వస్తున్నారు. సాయంత్రం అమరావతికి రానున్న నారా లోకేష్‌కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. లోకేష్ విదేశీ పర్యటనతో ఏపీ కేబినెట్ భేటీ, ఉద్యోగులకు డీఏల నిర్ణయం ప్రకటనలో జాప్యం ఏర్పడిందని సైతం ప్రచారం జరుగుతోంది. మరోవైపు నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకగా నిర్ణయం ప్రకటించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ పూర్తి
ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్‌దారులకు లబ్ది చేకూర్చాలని నెలకు ఒకరోజు ముందుగానే రాష్ట్రంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు మంగళవారం నాడు పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం యల్లమందలో పర్యటించారు. గ్రామంలో పింఛన్ లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు వారికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ నగదు అందజేశారు. మొదట మహిళ ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు వారి ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పిల్లలు చాలా తెలివైనవాళ్లు అని బాగా చదివించాలని సూచించారు. అనంతరం టీ షాపు నడుపుతున్న లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి చంద్రబాబు స్వయంగా టీ తయారుచేసి వారికి ఇచ్చారు. లబ్దిదారుడి కోరిక మేరకు టీ షాపు ఏర్పాటు కోసం రూ.5 లక్షలు రుణం ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
Also Read: AP Govt Good News ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం