Womens Hockey Olympic Qualifier: ఒలింపిక్స్ బెర్తుకు అడుగే దూరం,సెమీస్‌లో భారత మహిళల హాకీ జట్టు
FIH Hockey Olympic Qualifiers: హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత మహిళల జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్ బిలో ఇటలీతో జరిగిన చివరి మ్యాచ్‌లో 5-1తో ఘన విజయం సాధించారు.
హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీ(Hockey Olympic Qualifiers)లో భారత మహిళల జట్టు సెమీ ఫైనల్(semifinal)కు దూసుకెళ్లింది. పూల్ బి(Pool B)లో ఇటలీ(Italy)తో జరిగిన చివరి మ్యాచ్‌లో 5-1తో ఘన విజయం సాధించిన భారత మహిళలు... సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నారు. తద్వారా మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్ సెమీస్‌లో చోటు దక్కించుకుంది. వందో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఉదిత దుహాన్ రెండు గోల్స్‌తో సత్తా చాటడంతో... భారత మహిళల హాకీ జట్టు 5-1తో ఇటలీని చిత్తు చేసింది. భారత్ తరఫున ఉదిత (1వ, 55వ)తో పాటు దీపిక (41వ), సలీమా టెటె (45వ), నవ్‌నీత్ (53వ) స్కోర్ చేశారు. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన భారత్.. గ్రూప్-బిలో అమెరికా తర్వాత రెండో స్థానంతో సెమీస్‌కు అర్హత సాధించింది.
తొలి నిమిషంలోనే గోల్
ఇటలీతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న సెమీస్ బెర్తు ఖాయమయ్యే అవకాశం ఉన్నా భారత మహిళలు ఆరంభం నుంచి విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లారు. ఆట ఆరంభమైన తొలి నిమిషంలోనే ఉదిత గోల్‌తో భారత్ బోణీ చేసింది. తొలి నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ను ఉదిత సద్వినియోగం చేసింది. తొలి క్వార్టర్ కొన్ని సెకన్లలో ముగుస్తుందనగా ఇటలీకి స్కోరు సమం చేసే అవకాశం లభించింది. కానీ అవకాశాన్ని ఆ జట్టు ఉపయోగించుకోలేదు. రెండో క్వార్టర్ రెండో నిమిషంలో భారత్‌కు సంగీత పెనాల్టీ కార్నర్‌ను అందించింది. ఆ తర్వాత రెండు, మూడో క్వార్టర్లు హోరాహోరీగా సాగినా, ఆట మాత్రం ఎక్కువగా భారత్ ఆధీనంలోనే కొనసాగింది. మూడో క్వార్టర్‌లో భారత్‌కు లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను దీపిక గోల్‌గా మలచగా.. ఆ వెంటనే సలీమా ఫీల్డ్‌గోల్‌తో భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యం అందుకుంది. ఆఖరి క్వార్టర్స్‌లో నవ్‌నీత్, ఉదిత గోల్స్‌తో జట్టు గెలుపును ఖాయం చేశారు.మరో ఏడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.
నవ్‌నీత్ కౌర్ అయిదుగురు ఇటలీ డిఫెండర్లను తప్పించుకుంటూ గోల్ సాధించడంతో భారత్ 4-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. నిమిషం తర్వాత ఇటలీ వెంటవెంటనే పెనాల్టీ కార్నర్లను సాధించినా.. భారత గోల్‌కీపర్ సవితను బోల్తా కొట్టించలేకపోయింది. 55వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఉదిత గోల్‌గా మలచడంతో భారత్ 5-0తో నిలిచింది. ఆఖరి నిమిషంలో కామిలా చేసిన గోల్ ఇటలీకి ఊరట మాత్రమే.
తొలి మూడు స్థానాల్లో నిలిస్తే ఒలింపిక్స్‌కు
ఫైనల్లో చోటు కోసం గురువారం పూల్-ఎ టాపర్ జర్మనీతో తలపడుతుంది. మరో సెమీస్‌లో జపాన్‌ను అమెరికా ఢీకొంటుంది. ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇక ఇతర మ్యాచ్‌ల్లో జపాన్ 2-0తో చిలీపై, జర్మనీ 10-0తో చెక్ రిపబ్లిక్‌పై నెగ్గి సెమీ్‌స చేరాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో జర్మనీతో భారత్, అమెరికాతో జపాన్ తలపడనున్నాయి.