PBKS Vs DC: పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లిన ఢిల్లీ - కీలకమైన మ్యాచ్‌లో షాకిచ్చిన క్యాపిటల్స్!
ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 15 పరుగులతో ఓటమి పాలైంది.
Punjab Kings vs Delhi Capitals: ఐపీఎల్ 2023 సీజన్‌లో మరో డ్రమెటిక్ ఫినిష్. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ జరిగింది. పంజాబ్ విజయానికి చివరి ఓవర్లో 33 పరుగులు కావాలి. క్రీజులో సెటిలైన లియాం లివింగ్ స్టోన్ (94: 48 బంతుల్లో, ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) ఉన్నాడు. మొదటి బంతికే ఇషాంత్ డాట్‌గా విసిరాడు. దీంతో ఢిల్లీ విజయం దాదాపు లాంఛనం అయింది. లియాం లివింగ్‌స్టోన్ రెండో బంతిని సిక్సర్‌గానూ, మూడో బంతిని ఫోర్‌గానూ తరలించాడు. ఇషాంత్ శర్మ వేసిన నాలుగో బంతి లియామ్ లివింగ్‌స్టోన్ నడుం పైనుంచి వెళ్లడం, దాన్ని అతను సిక్సర్ కొట్టడం జరిగిపోయాయి. దీంతో సమీకరణం మూడు బంతుల్లో 16 పరుగులుగా మారింది. కానీ లివింగ్‌స్టోన్ తర్వాతి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోతాడు. దీంతో ఢిల్లీ 15 పరుగులతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితం అయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగులతో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఈ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలు క్లిష్టం చేసుకుంది.
లివింగ్‌స్టోన్, అథర్వ తైడే షో...
215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. శిఖర్ ధావన్ (0: 1 బంతి) తను ఆడిన మొదటి బంతికే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఖాతా తెరవకుండానే పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది. అయితే అథర్వ తైడే (55: 42 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (22: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఈ దశలో ప్రభ్‌సిమ్రన్ పెవిలియన్ బాట పట్టాడు.
ఆ తర్వాత లియామ్ లివింగ్‌స్టోన్ (94: 48 బంతుల్లో, ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు), అథర్వ తైడే వేగంగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. అథర్వ తైడే అవుటయ్యాక ఎవరూ రాణించలేదు. వరుస వ్యవధిలో పంజాబ్ వికెట్లు కోల్పోతూనే ఉంది. కానీ లివింగ్‌స్టోన్ పోరాటం మాత్రం ఆగలేదు. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోతూ ఉండటం, మరో ఎండ్‌లో ఎవరూ సహకారం అందించకపోవడంతో పంజాబ్ ఓటమి పాలైంది.
రిలీ రౌసో విధ్వంసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (46: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), పృథ్వీ షా (54: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) శుభారంభం అందించారు. వీరు వేగంగా ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 94 పరుగులు జోడించిన అనంతరం డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేసి శామ్ కరన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
ఆ తర్వాత వచ్చిన రిలీ రౌసో (82 నాటౌట్: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) మరింత విధ్వంసకరంగా ఆడాడు. వచ్చీ రాగానే బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. పృథ్వీ షాతో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. సరిగ్గా 15వ ఓవర్ చివరి బంతికి పృథ్వీ షా అవుటయ్యాడు.
ఫిల్ సాల్ట్ (26 నాటౌట్: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వచ్చాక పంజాబ్ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. తర్వాతి మూడు ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ చివరి రెండు ఓవర్లలో ఫిల్ సాల్ట్, రిలీ రౌసో విధ్వంసం సృష్టించేశారు. నాథన్ ఎల్లిస్ 19వ ఓవర్లో ఫిల్ సాల్ట్ రెండు సిక్సర్లు, ఒక బౌండరీ సహా 18 పరుగులు రాబట్టాడు. ఇంక హర్‌ప్రీత్ బ్రార్ వేసిన చివరి ఓవర్లలో రిలీ రౌసో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టగా, ఫిల్ సాల్ట్ చివరి బంతికి బౌండరీ సాధించాడు. ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. ఈ రెండు ఓవర్లలోనే 41 పరుగులు రావడంతో పంజాబ్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. పంజాబ్ కింగ్స్ బౌలరల్లో శామ్ కరన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.