GT Vs LSG: లక్నోపై గుజరాత్ భారీ విజయం - ఏకంగా 56 పరుగులతో విక్టరీ!
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 56 పరుగులతో విజయం సాధించింది.
Gujarat Titans vs Lucknow Super Giants: ఐపీఎల్ 2023 సీజన్ 51వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ (GT) 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. మొదటి 10 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లోనే నిలిచింది. కానీ చివరి 10 ఓవర్లలో కనీసం గెలవాలన్న కసి ఏమాత్రం కనిపించకుండా ఆడారు.
లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (70: 41 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (48: 32 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తనకు చక్కటి సహకారం అందించాడు. వీరు తప్ప మరే ఇతర బ్యాటర్ కనీసం 25 పరుగులు కూడా చేయలేకపోయాడు. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (94 నాటౌట్: 51 బంతుల్లో, రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ వృద్థిమాన్ సాహా (81: 43 బంతుల్లో, 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా ఎనిమిది బౌలింగ్ ఆప్షన్లను ప్రయత్నించింది. అయినా గుజరాత్‌ను ఆపలేకపోయింది.
227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఓపెనర్లు కైల్ మేయర్స్ (48: 32 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు), క్వింటన్ డికాక్ (70: 41 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మొదటి ఓవర్ నుంచి బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయారు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు సాధించింది. మొదటి వికెట్‌కు 88 పరుగులు జోడించిన అనంతరం కైల్ మేయర్స్‌ను అవుట్ చేసి మోహిత్ శర్మ మొదటి దెబ్బ కొట్టాడు.
ఆ తర్వాత లక్నో అస్సలు కోలుకోలేదు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌లో కూడా గెలవాలన్న కనీసం కసి కనిపించలేదు. భారీ షాట్లు కొట్టడం సంగతి పక్కన పెడితే కనీసం ఆ దిశగా ప్రయత్నించలేదు కూడా. ఓపెనర్ల తర్వాత ఆయుష్ బడోని (21: 11 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్ అంటేనే అర్థం చేసుకోవచ్చ.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా గుజరాత్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి బంతి నుంచే చిచ్చరపిడుగుల్లా చెలరేగారు. బౌండరీలు, సిక్సర్లతో పరుగుల వరద పారించారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది.
తర్వాత కూడా గుజరాత్ జోరు తగ్గలేదు. ఈ క్రమంలోనే వృద్ధిమాన్ సాహా అర్థ సెంచరీ పూర్తయింది. 10 ఓవర్లలో గుజరాత్ వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 142 పరుగులు జోడించిన అనంతరం అవేష్ ఖాన్ బౌలింగ్‌లో సాహా అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కాసేపు మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్లలో శుభ్‌మన్ గిల్ సిక్సర్లతో చెలరేగాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.