T20 World Cup 2021 Schedule: అభిమానులారా... గుడ్‌న్యూస్... రేపే ICC T20 ప్రపంచకప్ షెడ్యూల్
T20 ప్రపంచకప్ షెడ్యూల్‌ని ICC రేపు (ఆగస్టు 17న) అధికారికంగా ప్రకటించనుంది.
ప్రపంచంలోని క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న T20 ప్రపంచకప్ షెడ్యూల్‌ని ICC రేపు (ఆగస్టు 17న) అధికారికంగా ప్రకటించనుంది.
ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్
యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు T20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ICC ప్రపంచకప్ 2021 డ్రాను విడుదల చేసింది. ర్యాంకింగ్స్ ఆధారంగా మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించగా, మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. రెండు రౌండ్లుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. రెండో రౌండ్‌లో సూపర్-12 పద్దతిలో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
12 దేశాలను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఇక టోర్నీ లీగ్ దశలోనే భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్‌తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఉండగా.. మరో రెండు దేశాలు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఆడి చోటు దక్కించుకోనున్నాయి.
ఇక డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గ్రూప్ - 1లో ఉన్నాయి. క్వాలిఫయర్స్ ఆడిన రెండు దేశాలు ఈ గ్రూప్‌లో చేరనున్నాయి. టీమ్ ర్యాంకింగ్స్ ద్వారా గ్రూప్‌లను విభజించినట్లు ఐసీసీ ప్రకటించింది. '2021 మార్చి 20 నాటి టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా గ్రూప్స్‌ను విభజించడం జరిగింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు మొత్తం 8 జట్లు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లను కూడా రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది. ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమిబియా, శ్రీలంక గ్రూప్-ఏలో ఉండగా.. ఓమన్, స్కాట్లాండ్, పీఎన్‌జీ, బంగ్లాదేశ్ గ్రూప్‌బీలో ఉన్నాయి.'అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.
భారత్-పాక్ మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదన్న విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడతాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత మరోసారి భారత్-పాక్‌లు టీ20 ప్రపంచకప్ లీగ్ దశలోనే తలపడనున్నాయి.
అక్టోబరు 24న భారత్Xపాకిస్థాన్
అక్టోబర్ 24 న భారత్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ ఉంటుందని ఐసీసీ ప్రతినిధి గతంలో వెల్లడించారు. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానుంది. దుబాయ్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా ఇండియా, పాకిస్ధాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్‌లో దాయాదులు తలపడనున్నారు. దీంతో, ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.