Tirumala: తిరుమలేశుడి మినీ బ్రహ్మోత్సవం, ఏకాంతంగా రథసప్తమి వేడుకలు.. ఒక్కరోజే సప్తవాహనాల్లో మలయప్పస్వామి
ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ నిబంధనలు పాటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 8న జరిగే రథసప్తమి వేడుకలు ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ. ఆ రోజు జరిగే వాహనసేవల వివరాలివే..
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలలో రథసప్తమి వేడుకలు అతి ముఖ్యమైనవి. రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల్లో జరిగే వాహన సేవలు రథసప్తమి ఒక్కరోజే జరుగుతాయి.. అందుకే మినీ బ్రహ్మోత్సవం అంటారు. కరోనా కారణంగా ఈ ఏడాది రథ సప్తమి వేడుకలను ఏకాంతంగా జరపాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవారు సప్తవాహనాల్లో ఊరేగనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనసేవతో ప్రారంభమై చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవ, హనుమంత వాహనసేవ , కల్పవృక్ష వాహన సేవ ,సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. రధసప్తమి రోజు మధ్యాహ్నం శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం నిర్వహించనున్నారు.
Also Read: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….
ఇప్పటికే తిరుమలలో కరోనా నిబంనధనలు పటిష్టం చేశారు అధికారులు. శ్రీవారి దర్శనానికి రావాలంటే కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ గానీ, లేదా కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరి చేసింది టిటిడి. అలిపిరి తనిఖీ కేంద్రం, దర్శనానికి వెళ్లే క్యూలో వీటిని పరిశీలించిన తర్వాతే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. మాస్క్ లేనిదే దర్శనానికి అనుమతి లేదు. దీంతో పాటు ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తిరుమల రావొద్దని టీటీడీ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. రథసప్తమి వేడుకలు కారణంగా తిరుమలో అధిక సంఖ్యలో భక్తులు గుమికూడే అవకాశాలు ఉండడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గతేడాది రథసప్తమి సమయానికి కరోనా తగ్గుముఖం పట్టడంతో వేడుకలు వైభవంగా నిర్వహించారు. కానీ ఈ ఏడాది ఒమిక్రాన్ విజృంభణ కారణంగా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
Also Read: అప్పులు, అనారోగ్యం, శత్రుబాధలు తొలగించే సూర్యారాధన ...రథసప్తమి ప్రత్యేకత ఇదే..
స్వామివారి వాహన సేవలు
- ఉదయం 6 నుంచి 8- సూర్యప్రభ వాహనం
- ఉదయం 9 నుంచి 10- చిన్నశేషవాహనం
- ఉదయం 11 నుంచి 12- గరుడ వాహనం
- మధ్యాహ్నం 1 నుంచి 2 -హనుమంత వాహనం
- 2 నుంచి 3 వరకు రంగనాయకుల మండపంలో ఏకాంతంగా చక్రస్నాన మహోత్సవం
- సాయంత్రం 4 నుంచి 5 - కల్పవృక్ష వాహనం
- 6 నుంచి 7 -సర్వభూపాల వాహనం
- రాత్రి 8 నుంచి 9 - చంద్రప్రభ వాహనం
రథసప్తమి సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దుచేసింది టీటీడీ.
Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ ఫిబ్రవరి 8వ తేదీన రథసప్తమి ఏకాంతంగా నిర్వహించనున్నారు.
వాహనసేవల వివరాలివే
- సూర్యప్రభ వాహనం- ఉదయం 7 గంటల నుంచి 7.30
- హంస వాహనం - ఉదయం 8 నుంచి 8.30
- అశ్వ వాహనం - ఉదయం 9 నుంచి 9.30
- గరుడ వాహనం - ఉదయం 9 నుంచి 10
- చిన్నశేష వాహనం- ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు
- స్నపనతిరుమంజనం మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు
- చంద్రప్రభ వాహనం సాయంత్రం 6 నుంచి 6.30
- గజ వాహనం - రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు
రధ సప్తమి పర్వదినం సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుంచి 7 వరకు స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగించనున్నారు.
Also Read: యజ్ఞయాగాదులు దేవుడికోసం అనుకుంటే మీరు పొరబడినట్టే...