Somvati Amavasya 2022: 'సోమవతి అమావాస్య' అంత్యంత పవర్ ఫుల్, ఈ రోజు ఇలా చేస్తే సంపద-ఆరోగ్యం
పరమేశ్వరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం. అమావాస్య-సోమవారం కలిస్తే మరింత పవర్ ఫుల్. ఈ రోజున భోళాశంకరుడిని పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు. ఇంతకీ సోమవతి అమావాస్య ప్రత్యేకత ఏంటి…
నమః శంభవేచ మయోభవేచ నమః శంకరాయచ మయస్కరాయచ నమః శ్శివాయచ శివతరయాచ
ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం
సోమవతి అమావాస్య వెనుకున్న పురాణగాథ
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయాలనుకుని అందర్నీ ఆహ్వానిస్తాడు. కానీ తనకు నచ్చని శివుడిని పెళ్లిచేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని(పార్వతిని), అల్లుడు శివుడిని పిలవడు. అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటి వాళ్లు ప్రత్యేకంగా పిలవాలా ఏంటనే ఆలోచనతో ప్రమథగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్లిన సతీదేవి అవమానానికి గురవుతుంది. తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది. ఆగ్రహంతో ఊగిపోయిన శివుడు తన వెంట్రుకతో వీరభద్రుడిని సృష్టించాడు. ప్రమథ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీద దాడి చేశారు. యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు.
Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే
శివుడిని వేడుకున్న చంద్రుడు
గాయాల బాధ భరించలేకపోయిన చంద్రుడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుడి బాధచూసి కరిగిన భోళాశంకరుడు రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా కలిసొచ్చిందని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే ఆరోగ్యవంతుడవు అవుతావని చంద్రుడిని వరమిచ్చాడు . శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య' పేరుతో పిలుస్తున్నారు. సోముడు అంటే చంద్రుడు, ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుడిని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. అందుకే సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. శివుడిని అభిషేకించిన బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే.. సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాల్లో కానీ, రాహు కాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపించినా మంచి ఫలితం పొందుతారని అంటారు.
Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!
రావిచెట్టుకు ప్రదక్షిణలు చాలాముఖ్యం
సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగి పోతాయని విశ్వాసం.సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాసం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగి ఆరోగ్యం, సంపద కలుగుతుంది. ఈ వ్రతం చేసే స్త్రీకి వైధవ్యం ప్రాప్తించదని నమ్ముతారు.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే