NTR Name Reactions : ఎన్టీఆర్ పేరు తొలగించడంపై వ్యతిరేకత - యార్లగడ్డ రాజీనామా, వంశీ కూడా .. !
హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై వైఎస్ఆర్‌సీపీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీ నేతలు కూడా ఖండించారు.
NTR Name Reactions : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి కనిపిస్తోంది. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. దేనికైనా వైఎస్సార్ పేరు పెడితే తనకు అభ్యంతరం లేదని... కానీ, ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని... అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు గంగ ప్రాజెక్టుకు వైఎస్.. ఎన్టీఆర్ పేరు పెట్టారన్న యార్లగడ్డ
తెలుగుగంగ ప్రాజెక్టుకు 'ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు'గా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నామకరణం చేశారని యార్గగడ్డ గుర్తు చేశారు. అందుకే తనకు వైఎస్సార్ అంటే అంత గౌరవమని అన్నారు. చంద్రబాబుపై తనకు కోపం ఉండటానికి కారణం ఏమిటంటే... టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆయన వెళ్తున్నారని అన్నారు. టీడీపీని నడిపించే శక్తి చంద్రబాబుకే ఉందని తాను ఆనాడే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెపుతున్నానని తెలిపారు. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని... అలాంటి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకురాలేదని... కానీ, చంద్రబాబు తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు.
పేరు మార్పుపై పునరాలోచించాలని జగన్‌కు వల్లభనేని వంశీ
తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైఎస్ఆర్‌సీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పేరు మార్పుపై స్పందించారు. అయితే ఆయన యార్లగడ్డ స్థాయిలో రియాక్ట్ అవలేదు. ముఖ్యమంత్రి జగన్ ఎంతో పెద్ద మనసుతో నందమూరి తారక రామారావు పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇవ్వని గుర్తింపు ఇచ్చి స్పూర్తిగా నిలిచారని గుర్తు చేసారు. ఇదే సమయంలో..ఆ నిర్ణయం ఎంతో విప్లవాత్మకం - చారిత్మాకంగా పేర్కొన్నారు. అదే జిల్లాలో ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహానీయుడు పేరు కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని వల్లభనేని వంశీ ముఖ్యమంత్రిని కోరారు.
జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలిపారన్న సోము వీర్రాజు
బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.ఎన్టీఆర్ పేరు మార్చటం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట గలపటమేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చేందుకు ఎన్టీఆర్ పడిన తపన గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు.
స్పందించని కొడాలి నాని, లక్ష్మి పార్వతి
బిల్లును పాస్ చేసిన సమయంలో స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాం ఎన్టీఆర్ పిలుపుతో ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఎదిగారు. ఆయనే ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెడుతున్న బిల్లు ఆమోదం పొందినట్లుగా ప్రకటించారు. మరో వైపు ఈ అంశంపై కొడాలి నాని, లక్ష్మి పార్వతి వంటి వారు స్పందించలేదు.