Democracy in Danger : ప్రజాస్వామ్యానికి మనీ వైరస్ - ఈ పతనానికి బాధ్యులెవరు? ఓటర్లా ? నేతలా ?
ఓటర్లు ఓట్లు అమ్ముకుంటున్నారు. నేతలు కొంటున్నారు. ఆ నేతలు మళ్లీ అమ్ముడుపోతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ? ఈ పతనానికి ఎవరిది బాధ్యత ?
Democracy in Danger : ప్రంపంచంలోనే అతిపెద్దదైన మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందంట .... అని చప్పట్లు కొడదామా..? లేక అంగట్లో సరుకులా అమ్ముడుపోతోందంటూ.. నిట్టూర్పులు విడుద్దామా..? ఎందుకంటే రెండూ మన మాటలే. ఏకంగా 70 కోట్ల మంది ఓట్లు వేసుకుని గెలుపించుకునే గ్రేట్ ఇండియన్ డెమెక్రసీ ఇదీ అంటూ జబ్బలు చరుచుకునే మనం.. కొన్నాళ్లుగా ప్రజాస్వామ్యం ఫర్ సేల్ అంటూ హోల్ సేల్ గా జరుగుతున్న వ్యాపారాన్ని చూసి కాస్తైనా చింతిద్దాం.! ఓటుకు ఐదు వేలు ఇవ్వకపోతే మా గుమ్మం తొక్కద్దంటూ చేసిన వీధి పోరాటాలను చూసి... మరి కాస్త సిగ్గుపడదాం..!
పేరుకే ప్రజాస్వామ్యం - అసలు ధనస్వామ్యం !
For the People, By the People, of the People అని అబ్రహం లింకన్ నిర్వచించాడు. కానీ ఈ అర్థాన్ని Far the People, Bye the People, Off the People అంటూ మన వ్యవస్థ మార్చేసింది. జరుగుతోంది అదే కదా.. ప్రజాస్వామ్యం ప్రజలకు దూరం అయింది. ప్రజలను.. వారి ప్రతినిధులను కూడా కొంటున్నారు... అంటే బై ద పీపుల్.. Off ద పీపుల్ అంటే .. ప్రజలను కట్ చేసేశారు. ఇక్కడ ఇది పేరుకే ప్రజాస్వామ్యం. అసలు నిజం.. అది ధనస్వామ్యం. ద గ్రేట్ ఇండియన్ మార్కెట్. ఇక్కడ డెమక్రసీ ఒక కమెడిటీ.. షేర్ మార్కెట్ లో పెట్టట్లేదు కానీ.. పీఎస్ఎల్ వీ ను మించి పైకి దూసుకెళ్లే షేర్ అది.
ప్రజల ఓట్లే కాదు ఎమ్మెల్యేల ఓట్లనూ కొనేస్తున్న పార్టీలు !
ఎప్పుడో చీడ పట్టిన చెట్టు గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకూ అంటారా..తప్పడం లేదు. ఈ చీడ కొమ్మలను కబళించడంతో ఆగడం లేదు. వేరును పెకిలించే ప్రయత్నం చేస్తోంది. సరైన మందు పడకపోతే.. ఈ చీడ- ఈ పీడ రెండూ విరగడ అవ్వవు. ఏదో వేలంపాటలో ఓ కంపెనీని కొనుక్కుంటున్నట్లు.. ఓ రిసార్టులో ఎమ్మెల్యేలకు రేటు కడుతున్న మహత్తర దృశ్యాలను తెలంగాణ సీఎం... చిన్నతెర మీద ప్రదర్శించినప్పుడు.. ఏ స్థాయికి దిగజారిపోయిందో మన ప్రజాస్వామ్యం అని మరోసారి గుర్తుకువచ్చింది అంతే. సరే ఆ ప్రదర్శించినాయన నైతికత ఏంది.. ఆయనేమన్నా పరిశుద్ధుడా అనే కామెంట్ల గురించి కాసేపు ఆగి మాట్లాడుకుందాం. ఇదంతా జనాలకు తెలీని విషయం ఏం కాదు కానీ.. వారం క్రితం ఆడియో బయటకు వచ్చినప్పడు.. ఇప్పుడు వీడియోలు విడుదలవుతున్నప్పుడన్నా.. జనస్వామ్యంపై బాధ్యత ఉన్న వారు కాస్తైనా కంటి చూపు ఇటువైపు సారించాలి.
మనీ రాజకీయాల వల్ల బలహీనపడుతున్న ప్రజాస్వామ్య పునాదులు
భారత్ లో ప్రజాస్వామ్యం దిగజారిపోతోందని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ప్రపంచంలో అత్యధిక కాలం ప్రజాస్వామ్య విధానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న పెద్ద దేశాలు అమెరికా, ఇండియా మాత్రమే. భారత్ లో ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయన్న అంచనాలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. Is Indian Democracy Under Threat అంటూ Oxford యూనివర్సిటీ డిబేట్లు పెడుతోంది. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యం కోర్ ప్రిన్సిపల్స్ నుంచి దూరంగా జరగడం వల్ల భారత్ లో పరిస్థితులు క్షీణించాయని వెస్టర్న్ వరల్డ్ చెబుతుంది. బహుశా బీజేపీ హిందూత్వ అజెండా గురంచి వాళ్లు మాట్లాడుతుండొచ్చు. అంతర్జాతీయ మాగజైన్ ఎకనమిస్ట్ ప్రతి ఇచ్చే వరల్డ్ డెమక్రసీ ఇండెక్స్ రాంకింగ్ లో ఇండియా బాగా వెనుకబడుతోంది. కొన్నేళ్లుగా సూచీలో పాయింట్లు తగ్గిపోతున్న భారత్ ఇప్పుడు.. 46 వ స్థానంలో ఉంది. ఇది ఒక యాంగిల్ మాత్రమే. అయితే ప్రజాస్వామ్యానికి అసలు దెబ్బ పడుతోంది. మనీ ఫ్లో వల్లనే.
ఓటుకు రూ. ఐదు వేలిచ్చి గెలిచామని చెప్పుకునేవాళ్లు ఇప్పుడు బహిరంగం
నిన్నా మొన్నా చూశాం కదా.. ఎమ్మెల్యేల బేరం ఏ రీతిలో జరిగిందో. ఎవరు ఎవరిని కొన్నారు. ఎవరు ఎందుకు ఇరికించారు. వెనుక ఉన్న వాళ్లెవరూ.. ముందుండి నడిపించేదెవరూ అన్న విషయాలు జనాలకు కూడా తెలిసినవే. కానీ ఈ దృశ్యాలు పతనమవుతున్న మన ప్రజాస్వామ్యానికి సదృశ్యంగా చూపాయి అంతే. ఇంకొన్ని రోజుల ముందట.. కుప్పంలోని లోకల్ బాడీ మీటింగ్ లో ఐదువేలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాం అని ఓ ప్రజాప్రతినిధి భర్త నేరుగానే అన్నాడు. అసలు ప్రజాప్రతినిధి భర్త ఆ మీటింగ్ కు ఎందుకు వచ్చాడన్నది కూడా పొలిటికల్ పెరాలసిస్ కు సూచికే అయినా.. డబ్బులిచ్చి గెలిచాం.. అని మీటింగులో గొడవకు దిగడం అన్నది మాత్రం అత్యంత హైలెట్.
డబ్బులివ్వకపోతే ఓటేసేది లేదనేలా మారిపోతున్న ఓటరు చైతన్యం
మరి నాయకులు అమ్ముతున్నారు.. కొంటున్నారు అని గోల చేస్తున్నాం కానీ... జనాల సంగతేంటి.. నిన్నటికి నిన్న మునుగోడులో మాకిచ్చేది మూడేవేలా.. ఐదువేలా అంటూ.. జనం గోల చేశారు. పైసలు చాలవు.. బంగారం కావాల్నంటూ నేరుగా డేరుగా అడిగారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది. అమ్మకం.. కొనడం అన్నది అత్యంత నార్మల్ విషయం అన్న అవగాహనలోంచి వచ్చింది. ఎమ్మెల్యేలనే కొంటున్నప్పుడు.. మాదేందని వాళ్లు అంటున్నారు. జనం పరమ దుర్మార్గులు అంటూ నాయకుల తరపున అప్పుడెప్పుడో ఆపరేషన్ ధుర్యోధన అని ఓ సినిమానే చూపించేశారు. మీకు జనం గురించి మాట్లాడే నైతికిత అసలుందా అని పబ్లిక్ పబ్లిగ్గానే అడుగుతున్నారు.
రాజకీయ విలువలు అందరూ చెప్పేవాళ్లే.. పాటించేవాళ్లే లేరు !
ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యానికి జరుగుతున్న హాని గురించి గంటపాటు లెక్చరిచ్చిన కేసీఆర్ నే తీసుకోండి.. 2014 లో టీడీపీ తరపున గెలిచిన వారిలో 14 మందిని ఖాళీ చేశారు. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేను టీఆరెస్ లో మంత్రిని చేశారు. కిందటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ను అంతే చేశారు. ఏకంగా కాంగ్రెస్ మొత్తం విలీనం అయిపోయింది. అంతెందుకు... నిన్న ఫార్మ్ హౌస్ ఫైల్స్ అనే సినిమాలో కీ రోల్స్ చేసిన ఎమ్మెల్యేలు ముగ్గురు కాంగ్రెస్ వాళ్లే. “కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నిస్తే.. టీఆరెస్ బాధపడుతోంది.” అని జోకులు పేలుతున్నాయి బయట..! మరింక టీఆరెఎస్ కు నైతికత ఎక్కడిది. పోనీ పక్క రాష్ట్రాన్ని తీసుకుంటే.. తెరాస అందిచ్చిన స్ఫూర్తితో అప్పట్లో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను గుంజేశారు. ఇది నైతికతా...అంటూ ప్రశ్నించి.. నేను నిప్పులాంటి మనిషిని... నేనొచ్చి ఎధిక్స్ ను ఎక్స్ ప్లెయిన్ చేస్తా అని చెప్పిన జగన్ ఆ నిప్పులపై దుప్పుటి కప్పి.. బయట ఎమ్మెల్యేలను బాహాటంగా కావలించేస్కకున్నారు.
ప్రభుత్వాలను అలవోకగా కూల్చేస్తున్న బీజేపీ
ఇక తాజా గా రిలీజైన ఫామ్ హౌస్ సినిమాకు మూలాధారం బీజేపీ అని టీఆరెస్ చెబుతోంది. దానికి బొలెడంత బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. ప్రజాస్వామ్యమంటే.. అస్సలు లెక్కలేనట్లు ప్రభుత్వాలను.. పేకమేడలు కూల్చేసినట్లు కూల్చిన ఘన చరిత వాళ్ల సొంతం .. ఏకంగా. ఏకంగా ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. చిన్నా చితకా రాష్ట్రాలు వదిలేయండి. కర్ణాటక, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలనే మట్టుబెట్టిన చరిత్ర అది. బీజేపీ-కాంగ్రెస్ అలాంటివే అని చెబుతున్న కాంగ్రెస్ కూడా తక్కువేం కాదు. కాస్త వెనక్కెళితే ఇక్కడ కూడా టీఆరెస్ లో ఓ బ్యాచ్ ను ఎత్తుకొచ్చిన సందర్భం వైఎస్ టైమ్ లో జరిగింది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అధికార పార్టీకి చుట్టం
ఈ క్రయ విక్రయాలు ఇంతగా లేనప్పుడే.. రాజకీయ కప్పదాట్లను నివారించేందుకు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ను చేర్చారు..1985లో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్నిచేర్చారు. యాంటీ డిఫెక్షన్ లా గా దీనిని వ్యవహరిస్తున్నారు. యాంటీ డిఫెక్షన్ లో స్పీకర్ ది ముఖ్యమైన రోల్. కానీ ఈ విచక్షణను వారు ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా వాడుతున్నారు. ఇప్పటికీ 125 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది.. ఆ చట్టం వచ్చాక కూడా 70 సార్లకు పైగా సవరణలు చేశారు కానీ.. అందులో లోపాలను సవరించడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు.
ప్రజలతో పని లేకుండా డబ్బుతో నడిచే ప్రజాస్వామ్యంగా మారిపోతున్న వ్యవస్థ
జనంతో గెలవాలి.. ఓట్లు వేస్తేనే అధికారం అన్న పరిస్థితి లేదు. డబ్బులుంటే అధికారం ఎప్పుడూ ఉంటుందన్న సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇది ఇలాగే ఉంటే.. అధికార పార్టీ అన్నది ఎప్పుడూ ఇక అధికారం కోల్పేయే అవకాశమే ఉండదు. ఎమ్మెల్యేలను.. ఎంపీలను కొనడానికి మార్కెట్ నుంచి మనీ పంప్ అవుతూనే ఉంటుంది. ఓ రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చు పెడితే.. మూడు నాలుగు రాష్ర్లాలను ఈజీగా కొనేయచ్చన్న పరిస్థితి వచ్చేసింది. మనోళ్లు విలువలకు ఎప్పుడో వలువలు ఇప్పేశారు. విలువల్లేక పోయినా.. ప్రజల మద్దతుతో గెలిచారన్న విలువ అన్నా ఉండేది. ఇప్పుడు అదీ పోయిందనే నమ్మకాన్ని మరింత డబ్బు వెదజల్లి పోషిస్తున్నారంటే.. అది రోజు రోజుకు రుజువవంతుందంటే.. మన ప్రజాస్వామ్యం పాతాళానికి చేరిందన్న మాటను రూఢీ చేసుకోవాలన్నమాట.
మరి ఇలాగే చేస్తే.. భవిష్యత్ ఏంటి.. కొద్దో గొప్పో మిణుకు మిణుకుమనే ఆశను చంపేస్తే మిగిలేది ఏంటి..దేశం అడుగుతోంది..!