(Source: ECI/ABP News/ABP Majha)
వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్
వారసులను పార్టీలోకి తీసుకురావడానికి స్వాగతిస్తూనే అవగాహన లేకుండా ఎన్నికల బరిలోకి దింపడం సరైన నిర్ణయం కాదని సూచించారట. అలాగే ప్రజలకు కూడా మరోసారి జగన్ పాలన ఎలా ఉంటుందో చూడమని కోరుతున్నారట.
ఒక్క మాటతో అందరికీ క్లారిటీ ఇచ్చేశారు ఏపీ సిఎం జగన్. ఇంతకీ ఏంటా మాట అంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఎవరికి ఇస్తాను.. ఎలా ఇస్తాను అన్న విషయంతోపాటు వారసుల రాకపై కూడా స్పష్టంగా చెప్పేశారని అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. పార్టీ నేతలకే కాదు ప్రజలకు కూడా ఏపీ సిఎం మరోసారి తన పాలనపై స్పష్టత నిచ్చారంటున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారసులను దింపాలనుకున్న పార్టీ నేతల ఆశలను వైసీపీ అధినేత జగన్ నిరాశపర్చారని వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మేల్యేలు, పార్టీ నేతలతో సమావేశమైన జగన్ వారసుల రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ నేతల్లో చాలామంది తమ కుటుంబసభ్యులను రంగంలోకి దింపుతున్నారు. కొడుకులను ఇంటింటికి పంపించి ప్రభుత్వ పాలన, పథకాల గురించి వివరాలు సేకరిస్తున్నారు. అలా తమ వారసులను ఇండైరక్ట్‌గా ఇటు ప్రజలు అటు జగన్‌కి తెలిసేలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ నేతలు వాడుకుంటున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారసులకు టిక్కెట్లు ఇప్పించుకొని వారి వెనక నుంచి రాజకీయం నెరపాలని భావించారు కొందరు నేతలు. ఈ విషయం తెలసుకున్న జగన్ సమయం చూసి పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. వారసులను రంగంలోకి దింపినా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదనే విషయాన్ని ఆయన కూడా ఇండైరక్ట్‌గా చెప్పినట్లు తెలుస్తోంది. పనితీరుని మెరుగుపర్చుకొని, ప్రజలతో మమేకమైన వారికే టిక్కెట్లు ఇస్తానని, తనకి ఎంత దగ్గరవారైన సరే పని చేయకపోతే టిక్కెట్లు ఇచ్చేది లేదని ఈ సమావేశంలో స్పష్టం చేశారట.
పేర్నినాని, బుగ్గన కొడుకులను వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలనే ఆలోచనని జగన్‌కి ముందుగానే చెప్పారు. ఈ మధ్యనే సజ్జల కొడుక్కి సోషల్ మీడియా బాధ్యతలు అప్పజెప్పడంతో వీరు కూడా తమ వారసులను ప్రజల్లోకి పంపిస్తూ జగన్‌కి గొప్పగా పరిచయం చేసి తద్వారా ఎన్నికల బరిలోకి దింపాలని భావించారు. ఇప్పుడు ఆ ఆశలపై జగన్ నీళ్లు చల్లారట. 2024 ఎన్నికల్లో మీరే నిలబడాలని మీ వారసులను దించవద్దని కాస్తంత గట్టిగానే చెప్పారట.
వారసులను పార్టీలోకి తీసుకురావడానికి స్వాగతిస్తూనే అవగాహన లేకుండా ఎన్నికల బరిలోకి దింపడం సరైన నిర్ణయం కాదని సూచించారట. అలాగే ప్రజలకు కూడా మరోసారి జగన్ పాలన ఎలా ఉంటుందో చూడమని కోరుతున్నారట. మంత్రులు, ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేస్తేనే ఓటు వేయండి అని చెబుతూ నీతివంతనపాలనే మా ధ్యేయమన్న విధంగా ప్రజల్లోకి ఈ సమావేశం ద్వారా చెప్పినట్లు రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా అధికారపార్టీ మంత్రులు, ఎమ్మేల్యేలను ఇంటింటికి పంపి పథకాలు, పాలన గురించి అడిగింది లేదని సంబరపడుతున్నాయి వైసీపీ శ్రేణులు. ప్రజాసేవంటే కాలపేక్షం కాదని బాధ్యతాయుతమైన పని అని తెలియజేయడానికే జగన్ ఈ విధంగా పార్టీ నేతలకు చెప్పడంలో తప్పులేదంటున్నారు అభిమానులు. మరోవైపు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎదరించి చెప్పలేక వైసీపీ నేతలు సతమతమవతున్నారని, టిక్కెట్ రాని వారు పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.