UP Amma Canteens: అన్న క్యాంటీన్ల తరహా పథకాన్ని ప్రారంభించిన యూపీ సీఎం - రూ.9కే ఫుల్ మీల్స్ !
maa ki rasoi: పేదలకు తక్కువ ధరకే కడుపు నింపే పథకాన్ని యూపీ సీఎం ప్రారంభించారు. ఈ పథకానికి మా కీ రసోయి అని పేరు పెట్టారు.

UP News: ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు ఎంత ఆదరణ ఉందో చెప్పాల్సిన పనిలేదు. గతంలో టీడీపీ ప్రారంభించిన పథకాన్ని వైసీపీ రాగానే ఆపేసింది. కానీ అదే పథకాన్ని వచ్చిన వంద రోజుల్లో ప్రారంభిస్తామని హమీ ఇచ్చి ప్రారంభింప చేశారు. ఇప్పుడు పేదలకు ఎక్కడ కడుపు నింపే అవకాశం ఉంటే అక్కడ పెట్టాలని అనుకుంటున్నారు. ఇలాంటి పథకం హైదరాబాద్‌లో ఉంది. అన్నపూర్ణ పథకం కింద ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఉంది. ఇప్పుడు యూపీలోనూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు.
కుంభమేళకు ముందు 'మా కీ రసోయి'పథకం
కుంభమేళా ప్రారంభానికి ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం కమ్యూనిటీ కిచెన్ 'మా కీ రసోయి'ని ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజల కోసం స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రిలో నంది సేవా సంస్థ ఈ కమ్యూనిటీ కిచెన్ను నిర్వహిస్తోంది. ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ 'మా కీ రసోయి'ని ప్రారంభించి ఏర్పాట్లను పరిశీలించి, హాజరైన వారికి భోజనం వడ్డించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకునేందుకు నాంది సేవా సంస్థ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ప్రస్తుతానికి ఒక్క ాస్పత్రిలోనే అందుబాటులోకి
కమ్యూనిటీ కిచెన్ లో కేవలం 9 రూపాయలకే భోజనం దొరుకుతుంది. భోజనంలో పప్పులు, నాలుగు రొట్టెలు, కూరగాయలు, అన్నం, సలాడ్, స్వీట్లు ఉంటాయి. రూ.9కే భోజనం అందిస్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉపశమనం లభిస్తుంది. దీంతో ప్రజలు ఆహారం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కేవలం 9 రూపాయలు చెల్లించి నంది సేవా సంస్థ ద్వారా స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రిలో ఎవరైనా పూర్తి భోజనం చేయవచ్చు. ఆహారం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, ఇతర ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. చికిత్స కోసం ఈ ఆసుపత్రికి వచ్చి ఆహారం కోసం ఆందోళన చెందుతున్న వారికి 'మా కీ కిచెన్' ఉపయోగపడుతుందని నాంది సేవా సంస్థ తెలిపింది.
#Prayagraj | Uttar Pradesh Chief Minister Yogi Adityanath inaugurates 'Maa Ki Rasoi' run by Nandi Seva Sansthan, on Swaroop Rani Nehru Hospital premises@myogiadityanath @UPGovt #MaaKiRasoi pic.twitter.com/ZyQQwKay77
— DD News (@DDNewslive) January 10, 2025
మంచి స్పందన వస్తే రాష్ట్రమంతా అమలు చేసే అవకాశం
ప్రభుత్వాలకు ప్రజల సంతృప్తే ముఖ్యం. ఒక ఆస్పత్రిలోనే ఇలాంటి ఏర్పాటు చేస్తే.. ఇతర చోట్ల కూడా ఇలాంటి సేవలు కావాలని చాలా మంది కోరుకుటున్నారు. ప్రజల స్పందనను బట్టి.. ఆయా చోట్ల.. మా కి రసోయి క్యాంటీన్లను ఏర్పాటు చేసే అవకాశాలను .. యూపీ ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం కుంభమేళా నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో ఉంది.



















