Special Status For AP : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana Minister Comments On AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని...అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Telangana Minister Komatireddy Venkat Reddy Comments On Andhr Pradesh: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (Roads and Building ) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు ప్రత్యేక హోదా ( Special status) ఇవ్వాలని, అందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని...అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీని ఆదుకోవాలన్న లక్ష్యంతోనే పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారని అన్నారు. విభజన వేళ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏపీ భవన్ పై తెలుగు రాష్ట్రాల మధ్య గొడవ లేదు
ఢిల్లీలో పర్యటిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉమ్మడి ఏపీ భవన్‌కు వెళ్లారు. అక్కడ పలు బ్లాక్‌లను మంత్రి పరిశీలించారు. ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తుల వివరాలు, రాష్ట్ర వాటాను అధికారులు మ్యాప్ ద్వారా ఆయనకు వివరించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ నిర్మాణ స్థలాన్ని కోమటిరెడ్డి పరిశీలించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన ఆస్తులను పరిశీలించామన్నఆయన. తెలంగాణ భవన్ నిర్మాణ వివరాలను సీఎంకు వివరిస్తానన్నారు. ఇప్పటికే నిర్మాణం ఆలస్యమైందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు.
రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకే మణిహారం
త్వరలో రీజనల్ రింగ్ రోడ్ పనులు ప్రారంభిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నేషనల్ హైవేస్ అథారిటీ ఛైర్మన్‌ను కలిసి చర్చిస్తానన్న ఆయన, గత ప్రభుత్వం రూ. 300 కోట్ల విషయంలో ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా చేసిందన్నారు. రూ. 20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పూర్తిగా కేంద్రం భరిస్తోందన్న కోమటిరెడ్డి, యుటిలిటీ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోరిందన్నారు. గత ముఖ్యమంత్రి రూ. 300 కోట్లు ఇవ్వలేమని లేఖ రాయడంతోనే పనులు ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. 340 కి.మీ పొడవైన రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకే మణిహారం అని, సగం తెలంగాణ రాష్ట్రం దీని కింద కవర్ అవుతుందన్నారు. దేశంలో మరెక్కడా ఇంత పెద్ద రింగ్ రోడ్డు ప్రాజెక్టు లేదన్నారు కోమటిరెడ్డి. ముఖ్యమంత్రితో చర్చించి యుటిలిటీ ఖర్చులు భరిస్తామంటూ కేంద్రానికి లేఖ రాయిస్తానన్నారు. నెల రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చూస్తామని, రూ. 60 కోట్లకు ఒక టెండర్ చొప్పున బిట్లుగా పనిని విభజించి త్వరగా పూర్తయ్యేలా చూస్తామని వెల్లడించారు.
నల్గొండ నుంచి ఐదు సార్లు శాసనసభకు ఎన్నిక
రేవంత్ రెడ్డి కేబినెట్ లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నల్గొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఎన్‌ఎస్‌యూఐ ద్వారా రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. 1999, 2004, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. నల్గొండ స్థానం నుంచి వరసగా 3 సార్లు విజయం సాధించిన తొలి సభ్యుడిగా పేరు సంపాదించుకున్నారు. వైఎస్, రోశయ్య మంత్రివర్గాలలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖల మంత్రిగా పని చేసిన ఆయన, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011 అక్టోబరు 5న మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 4500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2022 ఏప్రిల్ 10న శాసనసభ ఎన్నికల స్టార్ క్యాంపెనర్‌గా నియామకం అయ్యారు. 2023 సెప్టెంబర్ 20న కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం సంపాదించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి విజయం సాధించి...మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.