Presidential Election 2022: ముంబయి వచ్చినా ఠాక్రేను కలవలేదు, ద్రౌపది ముర్ము వైఖరి దేనికి సంకేతం?
Presidential Elections: ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ముంబయి వెెళ్లారు. కొత్త ప్రభుత్వంలోని ఎంపీలను, ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. ఉద్దవ్ ఠాక్రేను మాత్రం కలవలేదు. ఈ విషయంపైనే రాజకీయంగా చర్చ జరుగుతోంది.
Presidential Elections:
ఠాక్రేను ఎందుకు కలుసుకోలేదు..?
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ముంబయిలో పర్యటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సారి వచ్చిన ఆమె, భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిశారు. వారితో పాటు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతోనూ ముచ్చటించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను మాత్రం కలుసుకోలేదు. ఇప్పటికే ఉద్దవ్ ఠాక్రే, ద్రౌపది ముర్ముకి మద్దతునిస్తున్నట్టుగా ప్రకటించారు. అయినా ఆమె మాతోశ్రీకి వెళ్లి ఠాక్రేను కలుసుకోకపోవటం ఆ పార్టీని కాస్త అసహనానికి గురి చేసింది. శివసేనకు చెందిన ఎంపీలందరితోనూ భేటీ అయినప్పటికీ, ఠాక్రే వైపు ఉన్న ఎంపీలు మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. శివసేన ఎంపీ వినాయక్ రౌత్ అంతకు ముందే ఇదే విషయాన్ని వెల్లడించారు. ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు అవటం లేదని స్పష్టం చేశారు. ద్రౌపది ముర్ముకి మద్దతు తెలపటాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని చెప్పారు. "ద్రౌపది ముర్ము, మాతోశ్రీకి వచ్చి ఠాక్రేను కలుసుకోవాలని మేం అనుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం ఆమెకు మద్దతు తెలపటం లేదు. గిరిజన తెగకు చెందిన ప్రజలపై మాకున్న గౌరవం వల్లే సపోర్ట్ చేస్తున్నాం" అని వినాయక్ రౌత్ తెలిపారు.
ట్రైబల్ సెంటిమెంట్‌తో ముర్ముకు మద్దతు..
గతంలోనూ రాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతునిచ్చింది శివసేన. 2007లో ప్రతిభా పాటిల్, 2012లో ప్రణబ్ ముఖర్జీకి సపోర్ట్ ఇచ్చారు. పాటిల్, ముఖర్జీ ఇద్దరూ కాంగ్రెస్ నేతలే అయినప్పటికీ అప్పట్లో మాతోశ్రీకి మర్యాదపూర్వకంగా వచ్చారు. కానీ ఈ సారి ద్రౌపది ముర్ము మాత్రం ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. గిరిజన వర్గానికి చెందిన మహిళను నిలబెట్టటం పట్ల గౌరవమిస్తూ, ఆమెకు పూర్తి మద్దతునిస్తామని స్పష్టం చేశారు ఠాక్రే. భాజపా, శివసేన మధ్య పరోక్ష యుద్ధం నడుస్తున్న సమయంలో ఠాక్రే ప్రకటన..విస్మయం కలిగించేదే. తప్పని పరిస్థితుల్లోనే ఆయన ఇలా సపోర్ట్ చేస్తున్నట్టు వెల్లడించారన్న వాదనలున్నాయి. అయితే తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టంగానే చెప్పారు. "గిరిజన వర్గానికి చెందిన ఓ వ్యక్తిని మొదటిసారి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారని, ఆమెకు మద్దతు తెలపటం మంచిదని..పార్టీ ట్రైబల్ లీడర్స్ చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని తెలిపారు ఠాక్రే. "వాస్తవానికైతే ప్రస్తుత పరిస్థితుల్లో నేనీ నిర్ణయం తీసుకోకూడదు. కానీ మా ఆలోచనలు మరీ అంత సంకుచితంగా ఉండవు" అని కామెంట్ చేశారు ఉద్దవ్ ఠాక్రే. ఈ ప్రకటన చేయటం వెనక రాజకీయ కోణమూ ఉంది. మహారాష్ట్రలో దాదాపు 10% మంది ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వారున్నారు. వారంతా శివసేనకు ఎప్పటి నుంచో ఓట్ బ్యాంక్‌గా ఉన్నారు. వీరి మద్దతు పోకుండా చూసుకోవాలంటే...తప్పనిసరిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముకి సపోర్ట్ ఇవ్వాల్సిందే.