Putin Arrest Warrant: ఆ కోర్టు తీర్పు మా దేశంలో చెల్లదు, దీనిపై చర్చ కూడా అనవసరం - ICC తీర్పుపై రష్యా అసహనం
Putin Arrest Warrant: పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై రష్యా అసహనం వ్యక్తం చేసింది.
Putin Arrest Warrant:
పుతిన్‌కు అరెస్ట్ వారెంట్..
ఉక్రెయిన్‌పై ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న రష్యాకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు షాక్ ఇచ్చింది. పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై రష్యా స్పందించింది. International Criminal Court (ICC) తీసుకున్న నిర్ణయాన్ని ఖండించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించడంపైనా అసహనం వ్యక్తం చేసింది. Reuters ప్రకారం...రష్యా ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ICC నిర్ణయంపై తమకు ఎన్నో అనుమానాలున్నాయని తేల్చి చెప్పారు. ఇది కచ్చితంగా అనైతికం అంటూ మండిపడ్డారు. రష్యాతో పాటు మరెన్నో దేశాలు ICC విధానాలను వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. "ICC తీసుకున్న ఏ నిర్ణయమైనా చెల్లదు. రష్యా చట్టం ప్రకారం ఈ తీర్పుని మేం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు" స్పష్టం చేశారు. ఒకవేళ పుతిన్ వేరే దేశానికి వెళ్లినప్పుడు ICC అరెస్ట్ వారెంట్ ప్రకారం ఆయనను అదుపులోకి తీసుకుంటే ఎలా..? అని మీడియా అడిని ప్రశ్నపై అసహనం వ్యక్తం చేశారు రష్యా ప్రతినిధి. "ప్రస్తుతానికి దీనిపై చర్చ అనవసరం. మేం చెప్పాలనుకుంటోంది కూడా ఇదే" అని సమాధానమిచ్చారు. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జకోర్వా కూడా ఇదే బదులు ఇచ్చారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తీర్పుని రష్యా పరిగణనలోకి తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు. దాదాపు ఏడాదిగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో రెండు దేశాలూ పట్టు వీడటం లేదు. ఫలితంగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లుతోంది.
#BREAKING Kremlin says ICC warrant for Putin 'void' pic.twitter.com/5ZN4Gb894N
— AFP News Agency (@AFP) March 17, 2023
ఉక్రెయిన్ హర్షం..
మైనర్లను చట్టవిరుద్ధంగా బహిష్కరించడంతో పాటు ఉక్రెయిన్ దేశం నుంచి రష్యా ఫెడరేషన్‌కు చట్టవిరుద్ధంగా ప్రజలను తరలించడాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. జనాభాను ముఖ్యంగా చిన్నారులను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి రష్యా ఫెడరేషన్‌కు జనాభా (పిల్లలను) చట్టవిరుద్ధంగా తరలించడం వంటి చర్యలకు పుతిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రజలను ముఖ్యంగా చిన్నారులను ఓ ప్రాంతం నుంచి బహిష్కరించడం, చట్టానికి వ్యతిరేకంగా తరలించడం లాంటి చర్యలను ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఐసీసీ అధికారులు చెబుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేయనుందని ఇటీవల రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. రష్యా బాలల హక్కుల కమిషనర్ మరియా అలెక్సేవ్నా ల్వోవా బెలోవాకు సైతం కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కేవలం ఆరంభం మాత్రమేనని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందని, రష్యాకు కోర్టులోనే శిక్ష పడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రధాన అధికారి ఆండ్రీ ఎర్మాక్ అన్నారు.
Also Read: Tata-Bisleri Deal: బిస్లరీతో చర్చలకు 'టాటా', రెండేళ్లు వృథా