PM Modi Birthday: ఎనిమిదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు, సబ్‌కా వికాస్ నినాదంతో ప్రజల్లోకి - ప్రధాని మోదీ బర్త్‌డే స్పెషల్
PM Modi Birthday: ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
PM Modi Birthday:
ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భాజపా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.."సేవా పక్వారా" (Seva Pakhwara)నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకూ ఈ కార్యక్రమం కొనసాగించాలని సూచించారు. ఇదే సమయంలో ఓ పుస్తకాన్నీ ప్రమోట్ చేయనున్నారు. "మోదీ @ 20 సప్నే హువే సాకార్" (Modi @20 Sapne Hue Sakaar) బుక్‌ను ప్రచారం చేయనున్నారు. ఇవే కాదు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా రికార్డు స్థాయిలో కొవిడ్ టీకాలు అందించాలనీ నిర్ణయించింది భాజపా. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ..క్రమంగా తన చరిష్మా
పెంచుకుంటూ వచ్చారు. భాజపాను క్షేత్రస్థాయిలో నుంచి బలోపేతం చేశారు. ప్రజాదరణ సంపాదించుకుని...2019లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. "సబ్‌కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ...ఈ ఎనిమిదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు.
1. జన్‌ధన్ యోజన:
ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (PMJDY)ను 2014లో ప్రారంభించారు. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో భాగంగా ఈ పథకం ప్రవేశపెట్టారు. ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్‌లు ఉండాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ పథకం...బాగానే వర్కౌట్ అయింది "ఆర్థిక అక్షరాస్యత" అనే కొత్త కాన్సెప్ట్‌కి తెర తీసింది. జన్‌ధన్ స్కీమ్‌లో భాగంగా కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఏడున్నరేళ్ల క్రితం మొదలైంది ఈ పథకం. ఇప్పటి వరకూ ఈ ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తం రూ.1.5 లక్షల కోట్లు.
2. ఆధార్
యూపీఏ హయాంలో ఆధార్ తీసుకురావాలన్న ప్రణాళికలు తెరపైకి రాగా...ఎన్‌డీఏ దాన్ని అమలు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు దారి మళ్లకుండా...అర్హులైన లబ్ధిదారులకు మేలు జరిగేలా చేసింది ఆధార్ కార్డ్. ఇప్పటికే 120 కోట్ల మంది ఆధార్ కార్డులు తీసుకున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
3. స్వచ్ఛ భారత్
2014 అక్టోబర్ 2న కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఓ జాతీయ ఉద్యమంగా మొదలైందీ కార్యక్రమం. క్లీన్ఇండియా విజన్‌లో భాగంగా స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం ద్వారా పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చింది కేంద్రం.
4. మేక్ ఇన్ ఇండియా (Make in India)
2014 సెప్టెంబర్‌లో మేక్ ఇన్ ఇండియా పథకం ప్రారంభించారు. భారత్‌ను తయారీ రంగంలో అంతర్జాతీయ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో మొదలైందిది. ఇండియా వృద్ధి రేటు పడిపోయిన తరుణంలో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. కాలం చెల్లిన విధానాలకు ఇది స్వస్తి పలికింది. కొత్త దారులు వేసింది.
5. ఆయుష్మాన్ భారత్
ఆయుష్మాన్ భారత్ యోజన/ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనతో నిరుపేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తోంది కేంద్రం. 2017లో నేషనల్ హెల్త్ పాలసీలో భాగంగా ఈ స్కీమ్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. అందరికీ ఆరోగ్యం అనే ఒకే ఒక లక్ష్యంతో ఈ పథకం అమలవుతోంది. దాదాపు 10 కోట్ల మంది పేదలకు లబ్ధి జరుగుతోంది. వీటితో పాటు మన్‌కీ బాత్, ఆత్మనిర్భర భారత్, డిజిటల్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో, నమామీ గంగే లాంటి పథకాలు కూడా అమల్లోకి వచ్చాయి.