AISSEE 2024: 'సైనిక్ స్కూల్స్' ప్రవేశ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాల నమోదుకు అవకాశం
AISSEE-2024 ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫిబ్రవరి 25న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల OMR రెస్పాన్స్ షీట్లను కూడా ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
NTA Provisional Answer Keys of AISSEE-2024: దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి జనవరి 28న నిర్వహించిన 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2024)' ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 25న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల OMR రెస్పాన్స్ షీట్లను కూడా ఎన్టీఏ విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఫిబ్రవరి 27న సాయంత్రం 5.30 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యంతరాల నమోదుకు అవకాశం ఉండదు.
AISSEE-2024 ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదుకోసం క్లిక్ చేయండి..
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 కొత్త సైనిక పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు జరుగుతాయి. దీని కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తోంది.
ఈ ఏడాదికిగాను ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జనవరి 28న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
వివరాలు...
☀ అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE -2024)
సీట్ల సంఖ్య: 5,822.
సీట్ల కేటాయింపు ఇలా..
మొత్తం సీట్లలో 6వ తరగతికి 2970 సీట్లు, 9వ తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఇక కొత్తగా మంజూరైన సైనిక స్కూళ్లలో 2155 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67 శాతం, ఇతర రాష్ట్రాల వారికి 33 శాతం సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50 శాతం సీట్లలో 25 శాతం ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25 శాతం ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీల్లేదు.