Madhya Pradesh High Court: పరాయి మగాడితో మాట్లాడినంత మాత్రాన అక్రమ సంబంధం అంటగడతారా - మధ్యప్రదేశ్ హైకోర్ట్
Madhya Pradesh High Court: భర్తతో కాకుండా మరో పురుషుడితో మాట్లాడినంత మాత్రాన అక్రమసంబంధం
Madhya Pradesh High Court:
ఆధారాల్లేకుండా ఎలా..?
మధ్యప్రదేశ్ కోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. "ఓ మహిళ భర్తతో కాకుండా వేరే పురుషుడితో మాట్లాడినంత మాత్రాన అది అక్రమ సంబంధంగానో, వ్యభిచారం లాగానో పరిగణించాల్సిన అవసరం లేదు" అని వ్యాఖ్యానించింది. జస్టిస్ వివేక్ రూసియా, జస్టిస్ అమర్‌నాథ్‌తో కూడిన ధర్మాసనం ఈ విషయం వెల్లడించింది. తన భార్యతో విడాకులు కావాలని కోరుతూ ఓ వ్యక్తి కోర్టుని ఆశ్రయించగా...ధర్మాసనం ఇలా స్పందించింది. ఈ పిటిషన్‌ను కొట్టి వేసింది. భర్తతో కాకుండా మరో వ్యక్తితో నడిచినంత మాత్రాన దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవాల్సిన
అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనడానికి సరైన ఆధారాలు ఉంటేనే అప్పుడు దానిపై విచారణ చేసేందుకు అవకాశముంటుందని తేల్చి చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె "అక్రమ సంబంధం" పెట్టుకుందని
ఆరోపించటం సరికాదని వెల్లడించింది. ఫ్యామిలీ కోర్ట్‌లో ఓ వ్యక్తి డైవర్స్ కోసం పిటిషన్ వేశాడు. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే తనకు విడాకులు కావాలని కోరాడు. తన భార్య వేరే పురుషుడితో ఉంటోందని, ఆ వ్యక్తి ఇంటికి వెళ్తుండగా ప్రత్యక్షంగా చూశానని చెప్పాడు. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న మహిళ మాత్రం..వీటిని కొట్టి పారేసింది. తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని, అందుకే ఇలా తనపై ఆరోపణలు చేస్తున్నాడని వివరించింది. ఇప్పటికీ తనకు భార్యగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని కోర్ట్‌లో తెలిపింది. అయితే..ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలేవీ లేకపోవటం వల్ల కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టి వేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా దీన్ని నేరంగా పరిగణించలేమని, ఈ అప్లికేషన్‌ను బుట్టదాఖలు చేస్తున్నామని స్పష్టం చేసింది.
బాంబే హైకోర్ట్‌లో..
అంతకు ముందు బాంబే హైకోర్ట్ ఓ కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివాహితకు అత్తింటివారు ఇంటి పనులు చేయాలని చెప్పడం క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది.
" ఒక వివాహితను ఇంటి పని చేయమని అడిగితే కచ్చితంగా అది కుటుంబ అవసరాల కోసమే. అంతేకానీ ఆమెను పని మనిషిలా చూస్తున్నట్లు కాదు. ఆమెకు ఇంటి పనులు చేయాలనే ఉద్దేశం లేకపోతే ఆమె పెళ్లికి ముందే ఆ విషయం వరుడి కుటుంబానికి చెప్పాలి. అప్పుడు వాళ్లు వివాహం గురించి పునరాలోచించుకుంటారు. పెళ్లికి ముందే ఇలాంటి సమస్యను పరిష్కరించుకోవాలి. "
- బాంబే హైకోర్టు
పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు తనను పని మనిషిలా చూస్తున్నారని ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ కేసులో మహిళ.. తన భర్త, అతడి తల్లిదండ్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ కోర్టు కేసును కొట్టివేసింది.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీలో స్కూల్స్ బంద్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ - ప్రకటించిన ప్రభుత్వం