HC on Love Marriage: కులాంతర వివాహం చేసుకుంటే కూతురు కాకుండా పోదు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన కూతురు కాకుండా పోదని మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
కులాంతర వివాహాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన తండ్రి కూతుళ్ల బంధం పోయినట్లు కాదని వ్యాఖ్యానించింది. పెళ్లైన తర్వాత కూడా ఆ కూతురుకు ఆయన తండ్రేనని తేల్చిచెప్పింది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ ఎమ్ఎస్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం.. మేజర్‌గా తనకు నచ్చినట్లు జీవించే హక్కు యువతికి ఉందని తీర్పు ఇచ్చింది. ఈ విచారణ సమయంలో ఆ యువతి తండ్రి, సోదరుడు కూడా ఉన్నారు.
ఇదే కేసు
మధ్యప్రదేశ్ హోషంగాబాద్‌లో ఉండే ఫైజల్ ఖాన్.. హిందువైన తన ప్రియురాలిని నారీ నికేతన్ (మహిళా ఆశ్రమం)లో బంధించారని ఆరోపిస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని.. ఆ యువతి (19) మేజర్ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సహజీవనం
ఈ ఏడాది జనవరిలో ఆ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చి తన ప్రియుడైన ఫైజల్ ఖాన్‌తో సహజీవనం చేస్తోంది. అయితే ఆమె తండ్రి తన కూతురు కనపడటం లేదని మిస్సింగ్ కేసు పెట్టారు. అనంతరం తాము సహజీవనం చేస్తున్నామని వారిద్దరూ పోలీసుల వద్ద అంగీకరించారు. ఆ తర్వాత నుంచి భోపాల్ వచ్చి ఇద్దరు కలిసుంటున్నారు.
ఆ తర్వాత ఇత్రాసీ పోలీసులు ఫిబ్రవరిలో వీరిద్దరినీ పిలిచి ఎస్‌డీఎమ్ ముందు వాంగ్మూలాలను రికార్డు చేశారు. అనంతరం ఆమెను నారీ నికేతన్‌లో ఉంచారు. దీంతో ప్రియుడు ఫైజల్ ఖాన్.. కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. విచారణ సందర్భంగా ఆ యువతి వీడియో కాన్ఫరెన్స్‌లో తాను నారీ నికేతన్‌లో ఉన్నట్లు చెప్పింది.
కోర్టు ఆదేశాలు
హైకోర్టు ఆదేశాలతో ఫైజల్.. తన విద్యార్హత, ఆదాయం, మతం వివరాలు పేర్కొంటూ ప్రమాణపత్రం దాఖలు చేశాడు. తమ అభిప్రాయాలకు తగ్గట్లు ఎవరి మతం వారు అనుసరించే స్వేచ్ఛ ఇద్దరికీ ఉన్నట్లు.. ప్రత్యేక పెళ్లి చట్టం కింద తాము వివాహం చేసుకుంటామని ఫైజల్ అందులో పేర్కొన్నాడు. దీంతో ఆ యువతి.. కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.