YSRCP On Amaravati :అమరావతిలో వేల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్! వైసీపీ సంచలన ఆరోపణలు, రహస్య ఒప్పందాలు అంటూ ట్వీట్!
YSRCP On Amaravati :అమరావతిని చంద్రబాబు తన బినామీలను పెంచి పోషించడానికి కడుతున్నారని మరోసారి ఆరోపించింది వైసీపీ. ఇందులో సామాన్యులకు చోటే లేదంటూ సింగపూర్‌తో జరిగిన ఒప్పందాలను బహిర్గతం చేసింది.

YSRCP On Amaravati :అమరావతిలో భూమి ప్రజలదని, అభివృద్ధి ఖర్చులు కూడా ప్రజలవేనని, కానీ ఆదాయం మాత్రం చంద్రబాబుది, చంద్రబాబు బీనామీలదేనంటూ విమర్శలు చేసింది వైఎస్‌ఆర్‌సీపీ. ట్రూత్ బాంబు పేరుతో కీలక డాక్యమెంట్స్‌ను బయటపెట్టింది. అందులో సంచలన ఆరోపణలు చేసింది. అమరావతిలో ఫ్రీ అన్న మాటే పచ్చి అబద్ధమని పేర్కొంది. ఫ్రీ అయితే స్టార్టప్ ఏరియా ఒప్పందంలో 42 శాతం డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టాల్సి వచ్చిందని ప్రశ్నించింది.
"చరిత్రలో ఎప్పుడూ చూడని అవినీతి"
చంద్రబాబు అసలు అవినీతి కథ అంటూ సుదీర్ఘమైన ట్వీట్ చేసింది. అందులో ఏముంది అంటే"స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కింద 1,691 ఎకరాల భూమిని సింగపూర్ సంస్థల కన్సార్షియంకు ప్రభుత్వం అప్పగిస్తుంది. అందులో 371 ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సి ఉంటుంది. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది. మిగతా 1,070 ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి ఒప్పందాన్ని చూశారా? విన్నారా?" అంటూ ప్రశ్నించింది.
సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీ (కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటు చేసే ఏడీపీ (అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్)కి భారీగా భూములు కేటాయించందని పేర్కొంది. ఇలా ఇచ్చిన భూమి ఖరీదు కనీసం నాలుగు కోట్లు ఉంటుందని... ఈ లెక్కన ఏడీపీకి కేటాయించిన 1,691 ఎకరాల విలువ రూ.6,764 కోట్ల పైనే ఉంటుందని ఆరోపించింది.
"ఖర్చులు ప్రభుత్వానివే"
ఏడీపీకి ఇచ్చిన భూమికి రోడ్లు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి సదుపాయాలన్నీ ప్రభుత్వం చెస్తుందని వైసీపీ పేర్కొంది. దీని కోసం రూ.5,500 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలని వెల్లడించింది. ఏడీపీలో సీసీడీఎంసీ వాటాగా రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుందని... స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.12,485.90 కోట్లు పెట్టుబడి పెట్టే రాష్ట్ర ప్రభుత్వానికి దక్కే వాటా 42 శాతమేనని తెలిపింది. "కేవలం రూ.306 కోట్లు మాత్రమే పెట్టే సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. సింగపూర్ కన్సార్షియంకు తొలుత 50, తర్వాత 200 ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు నాడు అంగీకరించారు. ఎకరా నాలుగు కోట్లు అప్పటి ధరలతో చూస్తే ఏకంగా ఆ రోజు ధరల ప్రకారం రూ.1000 కోట్లు. ఇప్పుడు మరింత విలువ కాదా? ఇది ప్రజల ఆస్తులను కొట్టేయడం కాదా?" అని ప్రశ్నించింది.
"కోర్టుల్లో ఎదురు దెబ్బ తగిలింది"
💣Truth Bomb 💣
— YSR Congress Party (@YSRCParty) July 29, 2025
Must Read ❗
రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు
ఒప్పందాలు.. వాస్తవాలు
1-ఫ్రీ అన్న మాటే పచ్చి అబద్ధం
2-భూమి మనది, దాని అభివృద్ధి ఖర్చులు మనవి. వచ్చే ఆదాయం , డబ్బులన్నీ కూడా @ncbn వి, ఆయన బినామీలవి. ఇది వాస్తవం కాదా?
3-ఫ్రీ అయితే స్టార్టప్ ఏరియా ఒప్పందంలో 42… pic.twitter.com/Yp7zYvZgjo
1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థల కన్సార్షియం నుంచి ప్రతిపాదనలను ప్రభుత్వం తీసుకుందని తెలిపింది వైసీపీ. ఈ విధానం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు ఆక్షేపించిందని గుర్తు చేసింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సింగపూర్ సంస్థల కన్సార్షియం గోప్యంగా ఉంచడం ఏంటని అక్షింతలు వేసి స్టే ఇచ్చిందని వివరించింది. ఐనా విషయాలను రహస్యంగా ఉంచేందుకే ప్రయత్నించిందని... దీని ఖరీదు అక్షరాలా రూ.66 వేల కోట్లని ఇది అక్రమమని ఆరోపించింది.
"సింగపూర్‌తో ఒప్పందాన్ని కాగ్ తప్పుపట్టింది"
సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందిస్తుందని చెప్పిన మాస్టర్ ప్లాన్ పనులను సింగపూర్ సంస్థలు ‘సుర్బానా–జురాంగ్’కు రూ.28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించాయని వైసీపీ గుర్తు చేసింది. దీన్ని 2023లో కాగ్ తప్పుపట్టిందని అన్నారు. మరి ఉచితమంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమే కదా? అని ప్రశ్నించారు.
"ప్రభుత్వానికి 8.7 శాతమే"
స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి తొలి విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటానే ఇస్తారని వైసీపీ తన ట్వీట్‌లో పేర్కొంది. ఈ లెక్కన ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతమే దక్కనుందన్నారు. కన్సార్షియానికి 91.3 శాతం వాటా లభిస్తుందని తెలిపింది. వాస్తవానికి కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ సహకరించారన్నారు. బాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా? అని నిలదీసింది.
"పైసా పెట్టుబడి లేకుండానే వేల కోట్ల దోపిడీ"
పైసా పెట్టుబడి లేకుండా చంద్రబాబు బాబు బినామీలు రూ.కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారని విమర్శలు చేసింది వైసీపీ. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే కనీసంగా రూ.66 వేల కోట్లు కొల్లగొడుతుంటే 54 వేల ఎకరాలు ఉంటే రాజధాని నిర్మాణంలో ఎన్ని లక్షల కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారో ఊహకు అందని విషయమని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. "స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీలతో ఏర్పాటయ్యే ఏడీపీ చేపడుతుంది. ఇక ప్లాట్ల విక్రయం వ్యవహారాలు చూసేందుకు ఓ మేనేజ్‌మెంట్ కంపెనీ ఏర్పాటు చేస్తారు. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. మరి ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి పోతోంది?"
"కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్"
సింగపూర్ కంపెనీల ప్రతినిధులు, చంద్రబాబు బినామీలే సభ్యులుగా ఉంటారని వైసీపీ ఆరోపించింది. ఎవరికి, ఎంతకు విక్రయించాలనేది మేనేజ్‌మెంట్ కంపెనీ చూస్తుందన్నారు. మామూలుగా ప్లాట్లు వేసి అమ్మడంలో ఖర్చు ఎకరాకు రూ.50 లక్షలు మించదన్నారు. కానీ, ఎకరాకు రూ.2 కోట్లు చూపించారని పేర్కొన్నారు. "1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3,137 కోట్లు ఖర్చవుతుందన్నది వీరి అంచనా. ఇందులో రూ.1,255.40 కోట్లను ప్రచార ఖర్చులు, కన్సల్టెన్సీ, డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ ఫీజు, వేతనాల కింద మేనేజ్‌మెంట్ కంపెనీ ముసుగులో చంద్రబాబు బినామీలు, సింగపూర్ సంస్థల కన్సార్షియం కొట్టేసేందుకు స్కెచ్ వేశాయి. ఈ స్కాంను అడ్డుకోవడం తప్పవుతుందా?" అని నిలదీసింది.
"అందుకే ఒప్పందం రద్దు"
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారని వైసీపీ ఆరోపించింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావడంతో అన్నింటికీ తెరపడిందన్నారు. కుంభకోణం బహిర్గతమవుతుందనే ఆందోళనతో ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు సింగపూర్ సంస్థల కన్సార్షియం 2019 అక్టోబర్ 30న నాటి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందన్నారు. వారి అభ్యర్థనతో నాటి ఒప్పందాన్ని రద్దు చేసినట్టు పేర్కొన్నారు.





















