PM Modi In Rajya Sabha: మణిపూర్‌పై రాజకీయాలు ఆపండి, కాంగ్రెస్ కు ప్రధాని నరేంద్ర మోదీ చురకలు
Manipur Violence : మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.
PM Modi In Rajya Sabha: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారు. మణిపూర్‌లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి కేంద్రం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. మణిపూర్‌లో జరిగిన హింసను కాంగ్రెస్ రాజకీయం చేయడం మానేయాలని మోదీ హితవు పలికారు. మణిపూర్ అంశంపై అగ్నికి ఆజ్యం పోయవద్దని ఆయన సూచించారు. 18వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత మణిపూర్ హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. మణిపూర్‌లో హింస తగ్గుతోందని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సంపూర్ణ శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నాయి.
11,000కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. 11,000 కంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 500 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఈ రోజు మణిపూర్‌లోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర సంస్థలు సాధారణ రోజుల మాదిరిగానే తెరుచుకుంటున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించినట్లే మణిపూర్‌లో కూడా పరీక్షలు నిర్వహించి చిన్నారుల భవిష్యత్ మనుగడకు సహకారం అందించామన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు.. రాష్ట్రపతి పాలనను విధించేవారని విమర్శలు గుప్పించారు. అయితే తాము మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు.
గతంలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన
మణిపూర్‌లో హింసను ప్రేరేపించిన వారి గురించి కఠిన స్వరంతో హెచ్చరించారు ప్రధాని మోదీ.. మణిపూర్ అగ్నికి ఆజ్యం పోయడానికి ప్రయత్నిస్తున్న వారందరికీ ఆ పనులను తక్షణమే ఆపాలని హెచ్చరించారు. మణిపూర్ ప్రజలు వారిని తిరస్కరించే సమయం వస్తుందని అన్నారు. మణిపూర్‌కు సుదీర్ఘ సామాజిక పోరాట చరిత్ర ఉందని .. ఈ పోరాటాల కారణంగానే మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రంలో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. దాదాపు 30 ఏళ్ల నాటి హింసను ప్రస్తావిస్తూ, 1993లో కూడా ఇదే విధమైన హింసాకాండ కొనసాగిందని ప్రధాని మోదీ అన్నారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయం చేయాలనుకునే వారికి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మోదీ ప్రకటించారు.
వారం రోజులు రాష్ట్రంలోనే అమిత్ షా
మణిపూర్‌లో హింస చెలరేగడంతో కేంద్ర హోంమంత్రి స్వయంగా చాలా రోజులు రాష్ట్రంలోనే ఉన్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారంరోజులు అక్కడే ఉండి పరిస్థితులు చక్కదిద్దిన తర్వాతే తిరిగి వెళ్లారన్నారు. మణిపూర్‌లో వరద సంక్షోభం నుంచి తేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. నేడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి చెందిన రెండు బృందాలు అక్కడికి చేరుకున్నాయని ప్రధాని అన్నారు. పరిస్థితిని అదుపులోకి తేవాలి కానీ, అగ్ని ఆజ్యం పోసి రాజకీయాలు చేయకూడదన్నారు.