Mumbai Restaurant: చికెన్ కర్రీ ఆర్డర్ ఇస్తే చిట్టెలుక వచ్చింది!
Mumbai Restaurant: ఆర్డర్ ఇచ్చిన భోజనంలో చికెన్‌కు బదులు చిట్టెలుక వస్తే? తలుచుకుంటేనే ఒల్లు జలదరిస్తుంది కదా! అలాంటి పరిస్థితే ఓ వ్యక్తికి ఎదురైంది.
Mumbai Restaurant: మామూలుగా బయట భోజనానికి వెళ్లినప్పుడు భోజనంలో బొద్దింకలు, ఈగలు, దోమలు కనిపిస్తేనే భయంకరంగా ఉంటుంది. ఆ భోజనాన్ని మనం తినగలుగుతామా? ముమ్మాటికి లేదు. అదే ఆర్డర్ ఇచ్చిన భోజనంలో చికెన్‌కు బదులు చిట్టెలుక వస్తే? తలుచుకుంటేనే ఒల్లు జలదరిస్తుంది కదా! అలాంటి పరిస్థితే ఓ వ్యక్తికి ఎదురైంది.
స్నేహితుడితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ బ్యాంక్ మేనేజర్‌కు ఇలాంటి అనుభవం ఎదురైంది. వారికి సరఫరా చేసిన చికెన్ కర్రీలో చనిపోయిన చిట్టెలుక వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తి ఇదేంటని సిబ్బందిని ప్రశ్నించారు. అయితే సిబ్బంది సైతం ఓవరాక్షన్ చేశారు. చేసిన తప్పుకు కష్టమర్‌కు క్షమాపణ చెప్పకుండా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
ఇంకేముంది ఆ కస్టమర్‌కు ఎక్కడో మండింది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తనకు జరిగిందంతా వారికి వివరించి కేసు పెట్టాడు. స్పందించిన పోలీసులు నేరుగా ఆ హోటల్‌కు చేరుకుని మేనేజర్, కుక్‌ను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన అనురాగ్ దిలీప్ సింగ్(40) గోరేగావ్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆగస్టు 13వ తేదీన స్నేహితుడు అమీన్ ఖాన్‌తో షాపింగ్ వెళ్లారు. అనంతరం ఇద్దరూ కలిసి బాంద్రాలోని పాపా పంచో ద దాబా రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ తమకు ఇష్టమైన చికెన్, మటన్ కర్రీలను ఆర్డర్ చేశారు.
కాసేపటికి సర్వర్.. వారు చెప్పిన ఆహారాన్ని వేడి వేడిగా తీసుకొచ్చాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ తినడం ప్రారంభించారు. ఇష్టమైన కర్రీ, భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో అనురాగ్ తాను తింటున్న కర్రీలో ఓ చికెన్ ముక్క కొంచెం అసాధారణంగా ఉండటాన్ని గమనించాడు. అయితే అప్పటికే దానిలో కొంత భాగాన్ని అనురాగ్ తినేశాడు. దాన్ని బయటకు తీసి పరిశీలించగా అది చనిపోయిన ఎలుక అని తెలుసుకుని షాకయ్యాడు.
ఆగ్రహించిన అనురాగ్ హోటల్ సిబ్బందిని పిలిచి చికన్ కర్రీలోకి ఎలుకపిల్ల ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆ సమయంలో హోటల్ మేనేజర్ వివియన్ ఆల్బర్ట్ సిక్వేరా అక్కడ అందుబాటులో లేడు. దీంతో ఆయనకు ఫోన్ చేసి హోటల్‌కు రప్పించి ఎలుకను చూపించారు. మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. తన 22 ఏళ్ల సర్వీస్‌లో ఇలాంటివి ఇప్పటి వరకూ జరగలేదని ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బదులిచ్చాడు.
వారి సమాధానంతో మండిపోయిన అనురాగ్ తన స్నేహితుడితో కలిసి బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చనిపోయిన ఎలుకను ఆహారంలో పెట్టి ప్రాణహాని కలిగిస్తున్నారని ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాను ఘటన జరిగిన వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నానని అనురాగ్, అతని స్నేహితుడు తెలిపారు. డాక్టర్ మందులు కూడా రాసి ఇచ్చారని చెప్పాడు. హోటల్‌కు వెళ్లిన పోలీసులు మేనేజర్, మరో ఇద్దరు వంటచేసే వాళ్లను అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కొద్ది సేపటికి హోటల్ సిబ్బంది బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఈ ఉదంతాన్ని హోటల్ మేనేజర్ ఖండించారు. తమ హోటల్‌కు వచ్చిన అనురాగ్, అతని స్నేహితుడు విపరీతంగా మద్యం తాగి ఉన్నారని, రెస్టారెంట్‌లో నిషేధించబడిన ప్రాంతంలో మద్యం సేవిస్తున్నారని అతను ఆరోపించారు. మద్యం తాగొద్దని చెప్పినందుకు ఎలుక కథను అల్లారని, బిల్లు ఎగ్గొట్టేందుకు ఎలుక కథ చెప్పారని ఆరోపించారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి రెస్టారెంట్‌లో బహుళ స్థాయిలో సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. తన 22 ఏళ్ల సర్వీస్‌లో ఒక్కసారి కూడా ఇలా జరగలేదన్నారు. రెస్టారెంట్ తరఫున న్యాయవాది దేవరాజ్ గోర్ మాట్లాడుతూ.. ఫిర్యాదు వెనుక దురుద్దేశపూరితమైన కారణాలు ఉన్నాయని ఆరోపించారు. మద్యం సేవించే విషయంలో సిబ్బందితో వాగ్వాదం జరిగిన తర్వాత, ఎలుకను చూపే లోపు వినియోగదారులు దాదాపు భోజనం ముగించారని ఆయన పేర్కొన్నారు.