Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్‌లో క్రూ ఎస్కేప్ పరీక్షకు ఇస్రో సన్నాహాలు
Gaganyaan Mission: గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా క్రూ ఎస్కేప్ సిస్టమి పరీక్షకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.
Gaganyaan Mission: చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో.. గగన్‌యాన్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ప్రత్యేకంగా రూపొందించిన టెస్ట్ వెహికల్ ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి క్రూ ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యుళ్లను శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని హార్డ్‌వేర్ వ్వస్థలు ఇప్పటికే శ్రీహరి కోటకు చేరుకున్నాయి. ప్రస్తుతం అనుసంధాన పనులు జరుగుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. టెస్ట్ వెహికల్-డీ1 లేదా క్రూ ఎస్కేప్ సిస్టమ్ మిషన్ గా పిలిచే ఈ ప్రయోగాన్ని అక్టోబర్ నెలలో నిర్వహించాలని ఇస్రో ప్రణాళిక రూపొందించింది. మిషన్ విఫలమయ్యే పరిస్థితి తలెత్తినప్పుడు మాడ్యుల్ నుంచి వ్యోమగాములు సురక్షితంగా బయటపడే సాంకేతికతను ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు.
గగన్‌యాన్ మిషన్ లో అత్యంత కీలకంగా భావించే ప్రొపల్షన్ సిస్టమ్ పనితీరును మెరుగు పరిచేందుకు ఇటీవల చేపట్టిన పరీక్ష సక్సెస్ అయింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో ఈ పరీక్షలు నిర్వహించగా.. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (SMPS) పనితీరును శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్షలు ప్రొపల్షన్ పనితీరును ధ్రువకీరించాయి. ఈ ఫలితాల ఆధారంగా ప్రొపల్షన్ ను శాస్త్రవేత్తలు మరింత మెరుగుపరచనున్నారు. సర్వీస్ మాడ్యూల్-సిస్టమ్ డిమాన్స్ట్రేషన్ మోడల్ (SM-SDM) ఫేజ్-2 టెస్టుల్లో భాగంగా రెండో, మూడో హాట్ పరీక్షలను తాజాగా మహేంద్రగిరిలో నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని ఇంజిన్ల పనితీరును సమీక్షించారు. థ్రస్టర్ ఇంజిన్లను కంటిన్యూయస్, పల్స్ మోడ్ లలో విజయవంతంగా పరీక్షించారు. ఈ నెల 19వ తేదీన మొదటి హాట్ టెస్టును నిర్వహించగా.. రాబోయే రోజుల్లో మరో 3 హాట్ టెస్టులను నిర్వహించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. తర్వాత నిర్వహించబోయే టెస్టులో 350 సెకన్లను లక్ష్యంగా పెట్టుకోబోతున్నారు. ఈ టెస్టు ద్వారా చివరి కక్ష్యను చేరుకోబోయే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్షలో భాగంగా ఎల్ఏఎం ఇంజిన్లను కంటిన్యూయస్ మోడ్ లో, ఆర్సీఎస్ థ్రస్టర్లను పల్స్ మోడ్ లో పరీక్షిస్తారు.
ఒక్కో దశను పూర్తి చేస్తున్న ఇస్రో
మొదటి దశలో అత్యవసర సమయంలో వ్యోమగాములను కాపాడే వ్యవస్థకు సంబంధించిన ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ పరీక్షను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా దీనిని గతేడాది నిర్వహించారు. తాజాగా.. రెండో దశ రికవరీ ట్రయల్స్ లో మాస్ అండ్ షేప్ సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ మోకప్ (CMRM) నిర్వహించారు. ఇది టెస్టింగ్ ప్రక్రియలో ఒక కీలకమైన భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. CMRM వ్యోమగాముల దగ్గరకు సకాలంలో చేరుకోవడం, రికవరీ విధానాలు.. నిజ జీవిత పరిస్థితులను కచ్చితంగా అనుకిరంచేలా ఈ ట్రయల్స్ ఉంటాయి. దాని వల్ల గగన్‌యాన్ మిషన్ విజయానికి విలువైన మరింత కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.
మిషన్ గగన్‌యాన్ ఎలా సాగుతుందంటే..
భూమికి 400 కిలోమీటర్ల కక్ష్యలో మొదట వ్యోమగాములను ప్రవేశపెడతారు. మూడ్రోజుల తర్వాత వారిని భూమికి తీసుకొస్తారు. తిరిగొచ్చే సమయంలో వ్యోమగాములు సముద్ర జలాల్లో పారాచూట్ల సాయంతో ల్యాండ్ అవుతారు. ఈ వ్యోమగాములను వేగంగా పికప్ చేస్తారు. ఇందుకోసం కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని నౌకాదళానికి చెందిన సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరగకుండా, ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరిగేలా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. గగన్‌యాన్ మిషన్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఉండే అవకాశాలున్నాయి.