హర్యానా అల్లర్ల ఘటనలో 80 మంది అరెస్ట్- 44 ఎఫ్‌ఐఆర్ లు!
దేశంలో రోజురోజుకి హింస పెరిగిపోతుంది. మణిపూర్ లో చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారకముందే హర్యానాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు.
దేశంలో రోజురోజుకి హింస పెరిగిపోతుంది. మణిపూర్ లో చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారకముందే హర్యానాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. గురుగ్రామ్ పరిసర ప్రాంతాల్లో సోమవారం అర్థరాత్రి రెండువర్గాల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల వల్ల ఇప్పటి వరకు నలుగురు చనిపోగా, అనేక మంది గాయపడ్డారు.
ఈ క్రమంలో ఈ అల్లర్ల ప్రభావం పక్క రాష్ట్రాల మీద ఉంటుందేమో అనే ఉద్దేశంతో పక్క రాష్ట్రాల పోలీసులు ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. తమ రాష్ట్రాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని లో అధికారులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పోలీసులు ముఖ్యమైన అన్ని ప్రదేశాలలో కూడా అధికారులతో పెట్రోలింగ్ పెంచినట్లు తెలిపారు.
దీని గురించి స్పందించిన ఓ పోలీసు అధికారి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆదేశాలు రాకపోయినప్పటికీ పరిస్థితులు చూస్తుంటే చాలా ఉద్రిక్తంగా అనిపిస్తున్నాయి. అందుకు మేము ముందుగానే అప్రమత్తంగా ఉన్నామని వారు తెలిపారు.
ఇదిలా ఉంటే హర్యానాలోని గురుగ్రామ్ లో ఇంకా 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. సోమవారం అర్థరాత్రి నుంచి ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది. దీంతో పాఠశాలలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుస్తుగా పోలీసు బలగాలు మోహరించాయి.
ఇదిలా ఉంటే..హర్యానాలోని నుహ్ ప్రాంతంలో ఇప్పటి వరకు పోలీసులు 80 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సుమారు 22 మంది పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 44 ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేసినట్లు తెలిపారు. సోమవారం అర్థరాత్రి సమయంలో హర్యానాలోని గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లోని మసీదుపై సోమవారం అర్థరాత్రి 45 మందితో కూడిన గుంపు దాడి చేసి మసీదుకు నిప్పంటించింది.
ఈ ఘటనలో ఒకరు మరణించారని, ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మసీదు వద్ద రాళ్లు రువ్వడంతో పాటు గుంపు మసీదులోకి ప్రవేశించి నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా ఓ ఇంటి బయట నిద్రిస్తున్న 23 సంవత్సరాల యువకుడిని కత్తితో పొడవడంతో ఆ యువకుడు తీవ్ర గాయాల పాలై మరణించాడు.
ఈ నేపథ్యంలో జరిగిన అల్లర్లు, చెలరేగిన మత ఘర్షణల గురించి తెలుసుకున్న పోలీసులు 48 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా అన్ని షాపులు, సంస్థలు, స్కూళ్లను మూయించారు. నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు జరిగిన రాళ్ల దాడి ఫలితమే ఇంతటి అల్లర్లు జరగడానికి కారణమని పోలీసుల భావిస్తున్నారు.