PM Modi Cabinet 3.0: కొలువుదీరిన ప్రధాని మోదీ కేబినెట్ 3.0 - ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారో?
Central Cabinet 3.0: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కొత్త కేబినెట్ 3.0 కొలువుదీరింది. ఇక అందరి దృష్టి శాఖల కేటాయింపుపైనే ఉంది. సోమవారం జరిగే కీలక భేటీలో ఎవరికి ఏ శాఖలు అనే దానిపై స్పష్టత రానుంది.
Suspension On Portfolios Allocation In Modi Cabinet 3.0: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ సర్కార్ కొలువుదీరింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ (PM Modi) సహా 71 మంది కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలతో సహా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. భారీ భద్రత మధ్య మోదీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. వీరిలో 30 మందికి కేబినెట్ మంత్రులుగా, ఐదుగురికి స్వతంత్ర హోదా, 36 మందిని సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది.
కేబినెట్ హోదా వీరికే..
రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జై శంకర్, మనోహర్‌లాల్ ఖట్టర్, హెచ్‌డీ కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్, శర్వానంద్ సోనోవాల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, వీరేంద్రకుమార్, జుయల్ ఓరమ్, ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్రసింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, మన్సుఖ్ మాండవియా, హర్దీప్ సింగ్ పూరి, సీఆర్ పాటిల్, చిరాగ్ పాశ్వాన్.
స్వతంత్ర హోదా..
ఇంద్రజిత్ సింగ్, జితేంద్రసింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రతాప్ రావు జాదవ్, జయంత్ చౌదరి
సహాయ మంత్రులు వీరే
జితిన్ ప్రసాద్, పంకజ్ చౌదరి, శ్రీపాదనాయక్, క్రిషన్ పాల్ గుర్జార్, రాందాస్ అథవాలే, నిత్యానందరాయ్, అనుప్రియా పటేల్, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్, శోభా కరంద్లాజే, ఎస్పీ సింగ్ బఘేల్, కీర్తి వర్దన్ సింగ్, బీఎల్ వర్మ, శంతన్ ఠాకూర్, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, కమలేష్ పాశ్వాన్, ఎల్.మురుగన్, అజయ్ తమ్తా, సురేష్ గోపి, నవనీత్ సింగ్, సంజయ్ సేథ్, రక్షాఖడ్సే, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్రదూబే, సుకాంత మజుందార్, దుర్గాదాస్ ఉకే, సావిత్రి ఠాకూర్, తోఖాన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, హర్ష్ మల్హోత్రా, మురళీధర్ మోహోల్, పబిత్రా మర్గెరిటా, జార్జ్ కురియన్
ఏయే శాఖలు ఎవరికి.?
సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలోనే మంత్రులకు శాఖల కేటాయింపుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్న శాఖలను అన్నింటినీ బేరీజు వేసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నట్లు సమాచారం. కీలక శాఖలైన ఆర్థిక, హోం, రైల్వే, రవాణా, రక్షణ, విదేశాంగ శాఖలను తమ వద్దే పెట్టుకోనుంది. ప్రధాని మోదీ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ఫోకస్ చేస్తామని గతంలోనే ప్రకటించగా.. వీటి పరిధిలోకి వచ్చే శాఖలను కూడా తమ వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. అటు, ఎన్డీయే కూటమిలోనూ భాగస్వామ్య పక్షాలు సైతం తమకు కావాల్సిన శాఖల కోసం పట్టబడుతున్నాయి. జేడీఎస్ నేత కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జేడీయూ సైతం తమకు కావాల్సిన శాఖలపై బీజేపీకి వివరించినట్లు సమాచారం.
మోదీ మార్క్ ఉంటుందా.?
కాగా, కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు, ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు, యువత, సీనియర్ల కాంబినేషన్‌లో కొలువుదీరింది. ఈ క్రమంలో శాఖల కేటాయింపులో కూడా మోదీ మార్క్ ఉండనుందని తెలుస్తోంది. కొత్త కేబినెట్‌లో 43 మంది మూడుసార్లు కంటే ఎక్కువసార్లు పార్లమెంట్‌కు ఎంపికయ్యారు. ఇక, కేంద్ర కేబినెట్‌లో ఇంకా 9 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.