China H9N2 outbreak: చైనా ఫ్లూ కేసులను కొవిడ్‌తో పోల్చకండి, ప్రమాదమేం లేదు - వైద్య నిపుణులు
China H9N2 Cases: చైనాలో ఫ్లూ కేసులు పెరుగుతుండటంపై భారత్‌లోని వైద్యులు కీలక సూచనలు చేశారు.
China H9N2 Cases Surge:
చైనా న్యుమోనియా కేసులు..
చైనాలో ఉన్నట్టుండి ఫ్లూ కేసులు (China pneumonia outbreak)పెరుగుతుండడం ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతోంది. మళ్లీ కొవిడ్ తరహా సంక్షోభం తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతానికి ముప్పేమీ లేదని, కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే చైనా మాత్రం "ఎలాంటి ప్రమాదం లేదు" అని తేల్చి చెబుతోంది. కొవిడ్ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేయడంతో పాటు శీతాకాలం మొదలవడం వల్ల ఈ ఫ్లూ కేసులు (China H9N2 Cases ) పెరుగుతున్నాయని వివరించింది. ఇన్‌ఫ్లుయెంజా, న్యుమోనియా లాంటి పాథోజెన్స్ (Pathogens) వ్యాప్తి చెందుతున్నాయని చెప్పింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఈ ప్లూపై పూర్తి స్థాయిలో వివరాలు అందించాలని విజ్ఞప్తి చేసింది. అందుకు చైనా స్పందించింది. ఎలాంటి ప్రమాదకరమైన వైరస్‌ని తాము గుర్తించలేదని తెలిపింది. చైనా క్లారిటీ ఇస్తున్నప్పటికీ భారత్‌లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని Ram Manohar Lohia Hospital డైరెక్టర్ డాక్టర్ అజయ్ శుక్లా (Dr Ajay Shukla) పలు సూచనలు చేశారు. ఇన్‌ఫెక్షన్ సోకే ముప్పు నుంచి తప్పించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యమని తేల్చి చెప్పారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు కాస్త దూరంగా ఉండాలని సూచించారు.
"ఎవరైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా...వాళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకిందన్న అనుమానమున్నా కాస్త భౌతిక దూరం పాటించండి. ఇప్పటికే కాలుష్య సమస్యతో చాలా సతమతం అవుతున్నాం. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా మాస్క్ ధరించండి. N95 లేదా N99 మాస్క్‌లు పెట్టుకుంటే మంచిది. చేతులు శుభ్రంగా ఉంచుకోండి"
- డా. అజయ్ శుక్లా, వైద్య నిపుణులు
ప్రమాదకరం కాదట..
ఇది మరీ ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్ కాదని, కేవలం అనారోగ్యానికి గురవుతారని వివరించారు శుక్లా. భారత్‌లో ప్రస్తుతానికి ఈ కేసులు నమోదయ్యే అవకాశాలు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
"చైనాలో ఈ ఫ్లూ కేసులు పెరుగుతున్న మాట నిజమే. కానీ భారత్‌లో ఇప్పటి వరకూ ఎవరికీ ఇది సోకలేదు. ఎక్కడా అసలు ఈ ఇన్‌ఫెక్షన్ సోకిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి మన వద్ద తక్కువ సమాచారమే ఉంది. అయినా సరే ఆందోళన చెందనక్కర్లేదు. ముందు దీన్ని కొవిడ్‌తో పోల్చడం మానేయాలి. ఎప్పటికప్పుడు ఈ కేసులపై నిఘా పెట్టడం అవసరం. అప్పుడు కానీ ఓ నిర్ణయానికి రాలేం"
- డా. అజయ్ శుక్లా, వైద్య నిపుణులు
భారత్ కీలక ప్రకటన చేసింది. చైనాలో ఫ్లూ కేసులు పెరగడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు వెల్లడించింది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. భారత్‌కి ఈ ముప్పు పెద్దగా ఏమీ ఉండదని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. చైనాలో ఈ కేసులు పెరిగిన వెంటనే Directorate General of Health Services (DGHS) ప్రత్యేకంగా సమావేశమైంది. భారత్‌లో ఇదే ఫ్లూ వ్యాప్తి చెందితే ఎలా కట్టడి చేయాలో చర్చించింది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply